Kadiyam Kavya : కడియం కావ్య వరంగల్ బరి నుంచి ఎందుకు తప్పుకుంది? కేసీఆర్ కు ఎందుకు షాకిచ్చింది?

Kadiyam Kavya

Kadiyam Kavya

Kadiyam Kavya : మూడు రోజుల కిందట మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి తనకు టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.. రెండు రోజుల కిందట కారులో లోక్ సభకు పయనమైన తనకు మద్దతు ఇవ్వాలంటూ హుషారుగా ప్రచారం సాగించారు. నిన్న రాత్రి వెల్లువెత్తుతున్న ఆరోపణలు, భూకుంభకోణాలతో కుదేలవుతున్న బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనని ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. టికెట్ వచ్చి ప్రచార బరిలోకి దిగే సమయంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయనంటూ ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం దగ్గర నుంచి బీఆర్ఎస్ కు షాకులు తగులుతున్నాయి. గతంలో కేసీఆర్ పేరు చెప్పుకుని పదవులు అనుభవించిన నేతలు అందరూ కారు దిగుతున్నారు. ప్రస్తుత అధికార, డబ్బు మత్తు రాజకీయాల్లో ఒక పార్టీకి అధికారం లేకుంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. మధ్యలో వచ్చిన నేతలంతా మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. కడియం శ్రీహరికి ఏ పదవి లేనప్పుడు, ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయ్యే సమయంలో కేసీఆర్ పిలిచి పదవులు ఇచ్చారు. ఆయనకు సొంత ఇల్లు లేదంటే కట్టుకోవడానికి డబ్బులిచ్చారు. అయినా కూడా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూతురు, ఆయన కలిసి పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు.

బీఆర్ఎస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు, వరంగల్ లోక్ సభ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరు చోట్ల పార్టీ ఓడిపోయింది. ఒక్క స్టేషన్ ఘన్ పూర్ లోనే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గెలిచారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో తాను బీఆర్ఎస్ లో కొనసాగలేనని, కాంగ్రెస్ లో చేరడానికి కడియం శ్రీహరి అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు. కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి బయటపడే అవకాశాలు లేకపోవడం, ప్రజల్లో ముఖ్యంగా యువతలో బీఆర్ఎస్ పై నమ్మకాన్ని కోల్పోవడం, కాంగ్రెస్ లో చేరితే మరో ఐదేళ్లు పదవులు అనుభవించే అవకాశం ఉండడంతో కడియం కావ్య కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లో చేరికతో మరికొంత మంది నాయకులు కూడా వారి వెంట నడిచే అవకాశం ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ రాష్ట్రంలోనూ, ఉమ్మడి జిల్లాలోనూ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

TAGS