YCP Leaders : ఎందుకిలా జరిగింది?..నిద్రలేని రాత్రులు గడుపుతున్న వైసీపీ నాయకులు, శ్రేణులు
YCP Leaders : ఏపీలో టీడీపీ కూటమి ట్రెమండస్ సక్సెస్ తో వైసీపీ నేతలకు నిద్రకరువైంది. స్వయంగా జగనే ప్రెస్ మీట్ లో ఏడ్చినంతా పనిచేశారు. అమ్మఒడి ఎటుపోయిందో..దీవించిన అమ్మలక్కలు ఎక్కడికెళ్లిపోయారోనంటూ బావురుమన్నారు. 2019లో 151 సీట్లు గెలుచుకుని టీడీపీ, జనసేనను మొన్నటిదాక ఎగతాళి చేసిన వైసీపీ వాళ్లు..ఇప్పుడు తమకు వచ్చిన 11 సీట్లను తలచుకుని గుండెలు బాదుకుంటున్నారు. ఓటర్లు 151 లో మధ్యలో 5ను కట్ చేసి రెండు ఒక్కట్లు కట్టబెట్టడంతో వైసీపీ నేతలు అవమాన భారంతో నక్కినక్కి ఏడుస్తున్నారు.
తాజా ఎన్నికల్లో వైనాట్ 175 సీట్ల టార్గెట్ బరిలో దిగిన వైసీపీ నేతలు ఒంటెద్దుపోకడలకు పోయారు. సిద్ధం సభలకు వచ్చేవారంతా జగన్ వెంటే ఉన్నారంటూ ప్రగాల్భాలకు పోయారు. తీరా ఓట్లు లెక్కిస్తే ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఓట్లు పాతాళానికి చేరాయి. వైఎస్ జగన్, పెద్దిరెడ్డి తప్ప ఒక్క మంత్రి గెలవకపోవడం కాదు కదా.. వైసీపీ కంచుకోట ఉమ్మడి కడప జిల్లాను సైతం టీడీపీ కూటమి బద్దలు కొట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు వైసీపీ నేతలు, శ్రేణులు..
ఇక ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత అసలేం జరిగింది? వైసీపీ కంచుకోటలు ఎందుకు బద్దలయ్యాయి? 90శాతం పక్కా అనుకున్న గ్రామీణ ఓటర్లు కూడా గంపగుత్తగా కూటమికి జై కొట్టడంతో వైసీపీ నేతల్లో ఆవేదనతో కుమిలిపోతున్నారు. తప్పు ఎక్కడ జరిగింది? అని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు సమీక్షలు చేసుకుంటున్నారు.
అయితే కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్టుగా వైసీపీ ఓటమికి చాలానే కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. జగన్ అరాచక పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల గుండాయిజం, ఇసుక దోపిడీ, భూకబ్జాలు..ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రజలను దోపిడీ చేసేవే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులంటూ జనాల్లో అయోమయం సృష్టించడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకపోవడం, పోలవరం కట్టకపోవడం, ఏదో ఒకటో రెండో సంక్షేమ పథకాలు ఓట్లు రాలుస్తాయనుకుని మిగతా వాటిని పక్కన పెట్టి అందినకాడికి దోచుకోవడం..ఇలా పలు కారణాల వల్ల వైసీపీ పుట్టి మునిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.