Governor Tamilisai : గవర్నర్ తమిళిసై రాజీనామా.. అర్ధంతరంగా ఎందుకు చేశారంటే..
Governor Tamilisai : లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలో అధికంగా నాడార్ ఓటు బ్యాంకు ఉండడంతో ఈ స్థానాల్లో ఒకచోట తమిళిసై పోటీ చేయనున్నారు. 2019లో తెలంగాణ గవర్నర్ గా నియమితులైన తమిళిసై అంతకుముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తుత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళసై డీఎంకే అభ్యర్థి కనిమొజీ చేతిలో ఓడిపోయారు.
తమిళిసై రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినపడుతూనే ఉన్నాయి. అప్పట్లోనే రాజీనామా చేస్తారని భావించారు. అయితే తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.