విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభకు తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ లతో పాటు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సభలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసినట్లు అర్థమవుతున్నది.
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఓ వైపు సమానత్వం గురించి పోరాడుతుంటే మరో ఉపముఖ్యమంత్రి సనాతన ధర్మం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారంటూ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. తమది సమానత్వమని, తాను ప్రశ్నిస్తే భయపడుతున్నారంటూ కామెంట్ చేశారు. తాను ఎన్నటికీ వెనుక బడిన వర్గాల తరఫునే మాట్లాడతానని, ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, తిరుమల లడ్డూ అపవిత్రమైందని వివాదం చెలరేగిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ లో పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ చెన్నై లో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.