AP Politics : కీలక శాఖలు ఆ ఇద్దరికే ఎందుకు..!
AP Politics : ఏపీలో కూటమి పాలన మొదలైంది. మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయగా.. శుక్రవారం వారికి శాఖలను అప్పగించారు సీఎం. 24 మంత్రుల అర్హత, చదువు, తదితరాలను బట్టి కసరత్తు చేసి భవిష్యత్ వ్యూహాలతో వారికి సూటయ్యే శాఖలు ఖరారు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని డెవలప్ మెంట్, ఉపాధి, సంక్షేమం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని కూటమి నిర్ణయించుకుంది. అందుకే ఆ శాఖల కోసం ఇద్దరిని ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ ఇద్దరి పైన భారీ అంచనాలున్నాయి.
బాబు ప్రభుత్వం సీనియర్లకు ప్రధాన శాఖలను కేటాయించింది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఖరారు చేశారు. మరో నేత అచ్చెన్నాయుడు కు వ్యవసాయశాఖ ఇచ్చారు. ఆనవాయితీగానే మహిళకు హోం శాఖ కొనసాగించారు. ఇందులో భాగంగా వంగలపూడి అనితకు హోం శాఖ దక్కింది. బీజేపీ నుంచి సత్యకుమార్ కు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగించారు.
కేశవ్ కు ఫైనాన్స్
రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ.. రాజధాని అంశాలే కీలకంగా ప్రజలు కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు సీఎంగా ఆర్థిక, రాజధాని వ్యవహారాలను సీనియర్ మంత్రుల భుజాలపై పెట్టారు. బాబు పర్యవేక్షణ ఉన్నా ఈ మంత్రుల పాత్రే కీలకం కానుంది. ఇలా రానున్న రోజుల్లో కూటమి భవిష్యత్ ఈ ఇద్దరిపైనే ఉంది. అప్పుల భారం మోపకుండా.. ఇచ్చిన హామీల అమలు చేస్తూ ఆర్థిక నిర్వహణ ఎలా చేయాలనేదే కొత్త ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమర్థతపై ఆధార పడి ఉంది.
నారాయణకు అమరావతి బాధ్యతలు
ఇక, 2014లో రాజధానిగా అమరావతిని అనౌన్స్ చేసినప్పటి నుంచి బాధ్యతలను పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ పర్యవేక్షించారు. ఈ సారి కూడా ఆయనకే ఆ శాఖను అప్పగించారు. అమరావతి అంశంలో న్యాయ పరమైన వ్యవహారాలు పరిష్కరించుకుంటూ.. రాజధాని నిర్మాణంపై ముందుకెళ్లాలని బాబు భావిస్తున్నారు. దీంతో.. అమరావతి విషయంలో నాడు చంద్రబాబుతో కలిసి ప్రతీ నిర్ణయంలో కీలకంగా వ్యవహరించిన నారాయణ ఇప్పుడు రాజధాని అంశం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో.. అటు కేశవ్ – ఇటు నారాయణ పని తీరే ప్రభుత్వంలో కీలకంగా మారనుంది.