KCR Strategies : కేసీఆర్ వ్యూహాలు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
KCR Strategies : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎలాగైనా విజయం సాధించాలని తాపత్రయపడుతున్నాయి. అధికారంలో ఉండగా ఏనాడు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు దానికి వ్యతిరేకతనే తీసుకొస్తున్నాయి.
అధికారంలో ఉండగా ఏనాడు రైతుల సమస్యలు గుర్తించని బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక రైతుల సమస్యలపై తమకే పట్టింపు ఉందనేలా ప్రవర్తించడం విచిత్రంగా ఉందంటున్నారు. రుణమాఫీ గురించి అప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ ప్రస్తుతం ఏదో సాధించినట్లు అనుకోవడం విడ్డూరమని కాంగ్రెస్ అంటోంది. 2018లో ఇచ్చిన హామీని నెరవేర్చకున్నా ఇప్పుడు ఏదో సాధించినట్లు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతు ఆత్మహత్యలను గురించి మాట్లాడని బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల కన్నీరు తుడుస్తున్నట్లు మాట్లాడడం దేనికి సంకేతమంటున్నారు. నాడు ప్రగతి భవన్, ఫాంహౌస్ ను వీడని కేసీఆర్ ఇప్పుడు ఏదో సాధించినట్లు తిరగడం అనైతికమని ఎద్దేవా చేస్తున్నారు. తాము అధికారంలో ఉంటే ఒకలా ఇతర పార్టీ ఉంటే మరోలా ఆలోచించడం బీఆర్ఎస్ కే చెల్లుతుందని విమర్శిస్తున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడేమో కాంగ్రెస్ మీద నిందలు వేస్తూ కాలం గడుపుకోవాలని చూడడం ఆశ్చర్యకరమే. దీంతో బీఆర్ఎస్ నేతలు నీళ్లు నములుతున్నారు. బీఆర్ఎస్ ఏది చేసిన వ్యతిరేక ఫలితమే వస్తోంది. దీనివల్ల ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రజల పక్షాన ఉంటున్నామని తెలిసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా అభాసుపాలవుతోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు భంగపాటు తప్పదంటున్నారు. అందుకే కడియం శ్రీహరి లాంటి వాళ్లు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇంకా కొందరు పార్టీని వీడి వెళతారని అంటున్నారు. దీంతో భవిష్యత్ లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు. రైతుల గురించి లేనిపోని కన్నీరు కారుస్తూ ఏదో చేస్తున్నట్లు నటించడం విడ్డూరమని చెబుతున్నారు.