Revanth Reddy : తెలంగాణ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం పీఠం ఎక్కిన రోజు నుంచే మహాలక్ష్మిని అమల్లోకి తెచ్చారు. ఇక పాలన చేపట్టి 100 రోజుల్లోనే మరో పథకం గృహలక్ష్మిని తెచ్చారు. గ్యాస్ సిలిండర్ అమలుకు పార్లమెంట్ ఎన్నికలు అడ్డు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఇదీ అమలు చేస్తున్నామని చెప్తున్నారు.
పథకాలపై ఎలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారో.. అంతే వేగంగా బీఆర్ఎస్ చేసిన మోసాలు, కుట్రలు, కుంభకోణాలను బయటకు తీస్తూ గులాబీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై తీవ్రంగా ఆగ్రహించిన రేవంత్ అందులో తిన్న డబ్బులను కక్కిస్తానని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TG తెచ్చారు. దీనికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు TS కాకుండా TG రానుంది.
ఇలాంటి మరో నిర్ణయం జిల్లాల పునర్వవస్థీకరణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం సమయంలో ఉన్న 10 జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం 33కు పెంచింది కలెక్టరేట్లు కట్టించింది, హంగామా చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 33ను 17కు కుదించలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తను ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో తీవ్ర దుమారం తలెత్తింది. ఇది మరో సంచలన నిర్ణయం అని కొందరంటుంటే.. తుగ్లక్ పని అంటు మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నిర్ణయం అమలైతే రద్దయ్యే జిల్లాలు ఇవే..
ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నారాయణపేట, జనగాం, వనపర్తి, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో తెలంగాణ ప్రజలు ఆందోళన, అయోమయంకు గురవుతున్నట్లు సమాచారం.
జిల్లాల పునర్విభజనతో నష్టాలు
ఆయా జిల్లాలు, వ్యవసాయ భూముల ధరలు, రియల్ ఎస్టేట్ భూముల ధరలు సడెన్ గా పడిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగోన్నతుల రద్దు, మళ్లీ భారీగా బదిలీలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అస్తవ్యస్తంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్ వ్యవస్థీకరణ, జిల్లా మ్యాప్ లను మార్చాలి. జోనల్ విధానం మార్పు, పరీక్షల సిలబస్ మార్పు. రెండేళ్ల పాటు నోటిఫికేషన్లు వీలు కాదు.
ఇప్పటికే నిర్మించిన
కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, ఇతర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం అవుతాయి.
లోక్ సభ ఎన్నికల ముందు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.