American Studies : ఎందుకొచ్చిన అమెరికా చదువులు?! పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్న తల్లిదండ్రులు..
American Studies : గత ఒకటి, రెండు దశాబ్దాలుగా అమెరికా చదువు అంటే ఎంతో గొప్పగా చూసేవారు. ఊరికి, అంతెందుకు పట్టణానికి ఒక్కరు లేదంటే ఇద్దరు మాత్రమే అమెరికా వెళ్లి అక్కడ చదువుకునే వారు. ఉద్యోగం వస్తే అక్కడే సెటిల్ అయ్యేవారు. అమెరికాలో చదువుకునే వారు సెలవులకు ఇంటికి వస్తే వారు ఏదో ఘనకార్యం సాధించిన వచ్చిన వారిలా పట్టణం మొత్తం వారిని చూసేందుకు వచ్చేవారు. కానీ సీన్ మారిపోయింది.
ఇంజినీరింగ్ కాలేజీలకు అటానమస్ స్టేటస్ వచ్చేసిందో అప్పటి నుంచి కాలేజీల సంఖ్య పెరిగింది. విద్యార్థులూ పెరిగారు. గతంలో ఇంజినీరింగ్ చదువంటే అంటే ఎంతో గొప్ప కానీ ఇప్పుడు సాధారణ డిగ్రీ కంటే కూడా చులకనగా చూస్తున్నారు. ఎంసెట్ లో ఏ చెత్త ర్యాంకు వచ్చినా ఏదో ఒక కాలేజీలు సీటు రావడం మాత్రం గ్యారంటీ. ఇక డక్కీ ముక్కీలు తింటూ ఎలా గోలా పాసైపోతున్నారు స్టూడెంట్స్.
ఇక వీరికి ఇండియాలో ఉద్యోగ అవకాశాలు కూడా సరిగా లేవు. అది కూడా మంచి కాలేజీలో చదివితే, క్యాంపస్ ఇంటర్వ్యూలలో కొందరు మాత్రమే సెలక్ట్ అవుతున్నారు. ఇక మంచి పర్సంటేజ్ లేకుంటే చిన్న పాటి కంపెనీలు వారి వైపు చూసే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేసి అమెరికా వెళ్తే.. అక్కడ ఏదో ఒక ఉద్యోగం రాకపోదా అని అనుకుంటున్నారు చాలా మంది.
తమ పిల్లలు కూడా డాలర్లు సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలని కలలు కనడం మంచి పరిణామమే. కానీ పరిస్థితుల మీద అవగాహన లేకుండా ఆ కలలను కనడం పొరబాటే అవుతుంది. అమెరికా యూనివర్సిటీలో సీటు వస్తే తమ పిల్లలను అమెరికా గుర్తించిందని సంబరపడద్దు. అసలది ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీనో అవగాహన ఉండాలి. గతంలో కొన్ని కాలేజీల్లో అడ్మిషన్ అంటే గతంలో వీసా దొరికేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫీజుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని అమెరికా వదులుకోవడం లేదు. ప్రతీ అడ్మిషన్ కు వీసా ఇచ్చేస్తోంది.
ఇక అమెరికాలో దిగాకనే అసలు కష్టాలు మొదలవుతాయి. తాజా పరిణామాలైతే మరీ దారుణంగా మారుతున్నాయి. అగ్ర దేశంలో చాలా చోట్ల గంజాయి వాడకాన్ని లీగలైజ్ చేశారు. ‘ఎడిబుల్స్’ పేరుతో చాక్లెట్ల రూపంలో గంజాయి బిళ్లలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఎలా వాడాలో తెలిస్తే బానసవుతాం.. తెలియకుంటే ప్రాణాలే పోతాయి. జెండర్ విషయంలో ఇక్కడి సంస్కృతికి అక్కడికి సంస్కృతికి తేడా ఉండడంతో సెక్స్ పరంగా తప్పు దోవ పడుతున్నారు.
విద్యాభ్యాసం ఎలాగోలా ముగిసి జాబ్ రాకుంటే ఇక అక్కడ బతుకు అడుక్కుతినే వాడికి ఎక్కువ, కొట్టుకుతినే వాడికి తక్కువగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో కొందరు తప్పుడు పనులు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటు పిల్లల గురించి ఆలోచించి తల్లిదండ్రులు సఫర్ అవుతుంటే.. తల్లిదండ్రులు బాధ పడతారు అని పిల్లలు కూడా చెప్పుకోవడం లేదు.
మొన్నటి వరకు ఎలా ఉన్నా నేడు మాత్రం అమెరికా వెళ్లిన ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం దొరకడం లేదు. పిల్లల టాలెంటె బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ వలయంలో చిక్కుకు పోవాల్సిందే.
ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా చదువు ప్రజెంట్ డేస్ రిస్కే! కేవలం టాప్ స్కోర్లు తెచ్చుకొని టాప్ 50 యూనివర్సిటీల్లో హై డిమాండ్ ఉన్న డిగ్రీలు చదివే మెరిట్ స్టూడెంట్స్ కు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి.
గాలివాటంగా చదివేసి, గుంపులో గోవింద కింద అమెరికా వెళ్లిపోవాలనే కలల కంటే ఉన్న చోటే చక్కగా చదువుకుని మంచి ఎమ్మెన్సీలోనో, కనీసం ఒక మోస్తరు కంపెనీలోనో జాబ్ సంపాదిస్తే నెమ్మదిగా కంపెనీ ఖర్చుతో ఆన్సైట్ వర్క్ మీద అమెరికా వెళ్లే కల తీర్చుకోవచ్చు.
ఆ మార్గాన్ని వదిలి చదువు కోసం అమెరికా వెళ్లడం అందరు విద్యార్థులకి సరైన నిర్ణయం అనిపించుకోదనే సత్యాన్ని గ్రహించాలి.