India vs England : రాజ్‌కోట్ ఎవరిదో..? హోరా హోరీగా సాగనున్న టెస్ట్ సిరీస్..
India vs England : భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు ఉదయం 9.30 నుంచి, రాజ్‌కోట్ టెస్ట్ సిరీస్ కీలక సమరానికి వేళయింది. ఆధిపత్యం కోసం తలపడుతున్న భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ నేటి నుంచే జరగబోతోంది. విశ్వాసంతో కనిపిస్తోన్న ఇంగ్లండ్ పై పైచేయి సాధించాలంటే రోహిత్ సేన నిర్ధాక్షిణ్యమైన ఆటతీరును ప్రదర్శించాల్సిందే. మిడిల్ ఆర్డర్‌లో అనుభవ లోపం టీమిండియాకు పెద్ద సవాల్ గా మారింది. అయితే, దేశవాళీ పరుగుల యంత్రం సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.
ఏళ్లుగా సొంత గడ్డపై టీమిండియాకు తిరుగులేదు. ప్రత్యర్థి జట్టు ఏదైనా అలవోకగా పైచేయి సాధిస్తోంది. కానీ ఇంగ్లాండ్ ఈ సారి భారత్ కు గట్టి పోటీనే ఇస్తుంది. తొలి టెస్టును కోల్పోయిన భారత్.. విశాఖలో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. పిచ్‌లు కూడా స్పిన్‌కు సహకరించకపోవడంతో రెండు జట్ల పోరు ఆసక్తికరంగా మారింది. రాజ్‌కోట్ వేదికగా గురువారం మూడో టెస్ట్ మొదలు కానుంది. మరి ఏ జట్టుదో ఆధిపత్యం!
భారత్‌కు మిడిల్ సమస్య..
హైదరాబాద్‌లో ఓటమితో ఆలోచనలో పడిన టీమిండియా కోలుకుంది. యశస్వి జైస్వాల్, బుమ్రా ప్రదర్శనతో విశాఖపట్నంలో పైచేయి సాధించి సిరీస్‌ను సమం చేసింది. అయినా మిడిల్ ఆర్డర్ పై ఆందోళన కొనసాగుతూనే ఉంది. అనుభవం లేని బ్యాటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. అసలే కొహ్లి, రాహుల్ దూరం కావడంతో ఇబ్బంది పడుతున్న భారత్ కెప్టెన్ రోహిత్ ఫామ్ కూడా విశ్వాసాన్నివ్వట్లేదు. ఏడాదిగా ఈ డాషింగ్ ఓపెనర్ దూకుడైన ఆట పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. అతడు భారీ స్కోర్లు చేయలేకపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనంతో ఆడడంపై రోహిత్ దృష్టిపెట్టే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ ముంబై బ్యాటర్, రజత్ పటీదార్ మిడిల్ ఆర్డర్‌లో 2 ముఖ్య స్థానాలను భర్తీ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఈ అనుభవరాహిత్యాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఇంగ్లాండ్ దృష్టి పెట్టింది.
ఇంగ్లాండ్ ఇద్దరు పేసర్లతో..
గత టెస్ట్ లో ఓడినప్పటికీ ఇంగ్లాండ్ రెట్టింపు ఆత్మవిశ్వాసంతో రాజ్‌కోట్ సమరానికి సిద్ధమైంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్‌పై బజ్‌బాల్ వ్యూహాన్ని పన్నాలని భావిస్తోంది. తొలి 2 టెస్టుల్లో ఒకే పేసర్‌తో బరిలోకి దిగిన జట్టు ఈ సారి తుది జట్టులోకి ఇద్దరు పేసర్లను తీసుకుంది. స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను తప్పించి మార్క్ వుడ్‌కు చోటిచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మాత్రం మార్పులు లేవు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది 100వ టెస్ట్.
పిచ్ ఎలా ఉందంటే?
రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. పరుగులు బాగానే వస్తాయని అనుకుంటున్నారు. మొదట్లో ఫ్లాట్‌గా ఉండే పిచ్ ఆ తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందని జడేజా చెప్పాడు.
తుది జట్లు
భారత్:
రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్/భరత్, అశ్విన్, బుమ్రా, కుల్‌దీప్, సిరాజ్
ఇంగ్లాండ్:
క్రాలీ, డకెట్, ఒలీ పోప్, బెయిర్‌స్టో, జో రూట్, స్టోక్స్, ఫోక్స్, హార్ట్‌లీ, రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, అండర్సన్.