Fifth List of YCP : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలతో భయపడిన సీఎం జగన్ ఏపీలో సిట్టింగులను మార్చుతున్నారు. దీంతో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలను మార్చుతారనే వాదనలు వస్తున్నాయి. ఈనేథ్యంలో ఇన్ చార్జీలను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారు.
దీంతో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు బల ప్రదర్శనకు దిగుతున్నారు. తమ బలం చూపించుకుని సత్తా చాటాలని చూస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కానీ జగన్ తీరుతో చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడినా తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిలుకలూరిపేట, రేపల్లె, ప్రత్తిపాడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చిలుకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనిని గుంటూరు పశ్చిమ సీటుకు మార్చారు. ప్రత్తిపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే సుచరితను తాటికొండకు మార్చారు. రేపల్లెలో ఇన్ చార్జీగా ఉన్న ఎంపీ మోపీదేవి వెంకటరమణ స్థానంలో ఈవూరి గణేష్ కు అవకాశం ఇచ్చారు. విజయవాడ వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ కు పంపించారు.
ఇలా పలు చోట్ల మార్పులు చేర్పులు చేపట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు తమ దారి చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ఎవరి జాతకాలు మారతాయోననే బెంగ అందరిలో పట్టుకుంది. అధినేత తీరుతో చాలా మంది నైరాశ్యంలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం మరింత పెరగనుంది.