MLC Elections 2024 : తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిన్ననే ముగిశాయి. సాధారణ ఎన్నికలకు దీటుగా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచిందనే చెప్పాలి. గతానికి భిన్నంగా ఈ సారి ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక వచ్చిందనే విషయం తెలిసిందే.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆశోక్ బాగానే పోటీ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేయడం రెండోసారి. గతంలో పల్లాకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే అప్పుడు తీన్మార్ మల్లన్న బీఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడంతో యాంటీ బీఆర్ఎస్, యాంటీ కేసీఆర్ ఓటు ఆయనకు కలిసి వచ్చింది. అయితే ప్రస్తుతం మల్లన్న అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగుల పక్షాన మల్లన్న పోరాడుతాడా? అనే సందేహం గ్రాడ్యుయేట్ ఓటర్లలో బలంగా పాకిందనే చెప్పాలి. గతంతో పోలిస్తే మల్లన్నకు ఆదరణ కూడా అంతంత మాత్రమే అనిచెప్పాలి. పలుమార్లు పార్టీలు మారడం, బ్లాక్ మెయిలర్ అని ప్రత్యర్థులు విపరీతంగా ప్రచారం చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ వారే మల్లన్న ప్రచారానికి దూరంగా ఉండడం మైనస్ గా మారింది.
ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి బిట్స్ పిలానీలో చదివి రాజకీయాల్లోకి వచ్చారు. తన వాగ్దాటితో నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం వద్ద ప్రశ్నించే సత్తా ఉందని గ్రాడ్యుయేట్లలో బాగానే ప్రచారం అయ్యింది. విద్యా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా రాకేశ్ రెడ్డికి ఉండడం కలిసి రానుంది. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. బీజేపీ ఓట్లు కూడా రాకేశ్ రెడ్డి వైపే పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. దీని వల్ల రాకేశ్ రెడ్డికి ప్లస్ గా మారే అవకాశాలు ఉన్నాయని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ ఓటర్లు దాదాపుగా రాకేశ్ రెడ్డి వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ఇక నల్లగొండ జిల్లా నుంచి తీన్మార్ మల్లన్న కు స్వతంత్ర అభ్యర్థి, పోటీపరీక్షల శిక్షకుడు అశోక్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశమూ కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు ఒక్క జిల్లావారే. అశోక్ కు నల్లగొండ నిరుద్యోగుల్లో మంచి పట్టే ఉంది. నిరుద్యోగ సమస్యలపై అశోక్ నిజాయితీగా ముందుండి పోరాడడం అందరికీ తెలిసిందే. అయితే స్వతంత్ర అభ్యర్థి కావడంతో యువతకు తప్ప మిగతా గ్రాడ్యుయేట్ ఓటర్లకు అశోక్ సార్ తెలిసే అవకాశం లేదు. అలాగే వెనక ఏ పార్టీ క్యాడర్ లేకపోవడం కూడా అశోక్ కు మైనస్సే. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. అయితే రాకేశ్ రెడ్డి, తీన్మార్ మల్లన్నల మధ్యే ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.