America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది ఎవరు..? పొలిటికల్ నోస్ట్రడామస్ ఏమంటున్నారంటే..

America

America

America : ప్రపంచంలో ఈ ఏడాది పలు దేశాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ లపైనే ఉంది. భారత్ లో ఇప్పటికే రెండు దశలు ఎన్నికలు పూర్తికాగా, మరో ఐదు దశలు మిగిలి ఉన్నాయి. జూన్ 4న వచ్చే ఫలితాలతో ఎవరు ప్రధాన మంత్రిగా  బాధ్యతలు స్వీకరిస్తారో తెలిసిపోతుంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తలపడనున్నారు. ఇలా పోటీలో నిలువడం వీరికి ఇది రెండోసారి కావడం గమనార్హం.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈక్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలకు దిగుతున్నారు. ఆ మధ్య బైడెన్ మాట్లాడుతూ ట్రంప్ కోరుకున్నట్లే అమెరికా అగ్రరాజ్యంగా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. జీ 7, జీ 20 వంటి అంతర్జాతీయ వేదికలపై మీరే గెలవాలని తనతో చెప్పారని బైడెన్ పేర్కొన్నారు. యావత్ ప్రపంచం అమెరికా వైపే చూస్తోందని అన్నారు.

ఇదిలా ఉండగా..ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదానిపై అనేక అంచనాలు, సర్వేలు, నివేదికలు వెల్లడిస్తున్నారు. అమెరికన్ పొలిటికల్ అనలిస్టులు తమ తమ ఒపినియన్స్ చెబుతున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ కు మహిళల మద్దతు పెరిగిందని తెలిపారు ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ అలన్ లిచ్ మన్. జాతీయ పోలింగ్ సగటులో బైడెన్ తో పోలిస్తే ట్రంప్ 1.5 శాతం ముందంజలో ఉన్నారని తెలిపారాయన. లీగల్ ట్రబుల్స్ ప్రభావం అంతగా లేదని, నల్ల జాతి విద్యావంతుల్లో ఆదరణ పెరిగిందన్నారు. కాగా, లిచ్ మన్ విశ్లేషకుడిగా మంచి పేరుంది. అమెరికాలోని చివరి 10 ఎన్నికలలో 9 సార్లు ఆయన జోస్యం నిజమైంది. 13 అంశాల ఆధారంగా గెలుపోటములను అంచనా వేసే అలన్ ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్ గా అక్కడి వారు పిలుచుకోవడం గమనార్హం.

TAGS