Pithapuram : పిఠాపురంలో గెలుపెవరిది?
Pithapuram : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హాట్ పేవరేట్ సీట్ అంటే పిఠాపురం. ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడం వల్ల అందరి దృష్టి అతడిపైనే పడింది. 2019 లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి భారీ మెజార్టీతో శాసన సభలో అడుగుపెట్టాలని పిఠాపురం ఎంచుకున్నారు. దీంతో జన సైనికులు, సినీ వర్గాల వారు ఎంతో మంది పవన్ గెలుపు కోసం పని చేశారు.
ఇదే స్థానంలో వంగా గీత కోసం జగన్ కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహించారు. వంగా గీతను గెలిపించేందుకు వైసీపీ నేతలు శాయశక్తులా పని చేశారు. వంగా గీత ను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని జగన్ ప్రచార సభలో మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రాజకీయాలు హీటెక్కాయి.
పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.69 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి ఎన్నికల్లో 86 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. దీంతో గెలుపొటములపై రెండు పార్టీలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. పిఠాపురం ప్రజలు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన వంగా గీతను గెలిపించారు. ఇప్పుడు ఆమెనే పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పోటీ చేయడం గమనార్హం.
అప్పుడు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను కాదని వంగ గీతను గెలిపించిన పిఠాపురం ప్రజలు 2019 లో వైసీపీ అభ్యర్థి దొరబాబుకు 14 వేలకు పైగా మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ పోటీ చేసిన వర్మ పవన్ కు మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన నుంచి 2019 లో పోటీ చేసిన శేష కుమారీ వైసీపీలో చేరారు. అటు టీడీపీ నాయకుడు వర్మ అన్ని తానై పవన్ కల్యాణ్ కోసం పోటీ చేస్తుండగా.. వైసీపీ కోసం శేషుకుమారి ప్రచారం నిర్వహించారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ గెలుస్తున్నాడని జనసేన, టీడీపీ కార్యకర్తలు ధీమా గా ఉంటే.. వంగా గీత గెలుపు ఖాయమని వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.