KTR Predicts : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. గెలుపు కోసం ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. మూడు కూటములు పోటీలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి, వైసీపీ కూటమి, కాంగ్రెస్ కూటములు ముమ్మరంగా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నాయి. దీని కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ఏపీలో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పే సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్లు కర్ర విరగదు పాము చావదు అన్నట్లు సమాధానం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారంటే అటు ఇటు తిప్పి ఎవరికి అర్థం కాని సమాధానం చెప్పడం గమనార్హం.
జగన్ నాకు అన్నయ్య, పవన్ కల్యాణ్ అంటే అభిమానం, చంద్రబాబు అంటే పెద్ద మనిషి, లోకేష్ మిత్రుడు అంటూ సమాధానం చెప్పారు. అదే అధికారంలో ఉంటే కచ్చితంగా జగన్ గెలుస్తాడని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో కేటీఆర్ తెలివిగా ఎవరితో గొడవెందుకన్న చందంగా తప్పించుకునే విధంగా సులువుగా సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో లేకపోయే సరికి ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇలాంటి సమాధానం చెప్పాడని తెలుస్తోంది. ఈనేపథ్యంలో సొంత రాష్ట్రంలో అన్నిచక్కదిద్దుకుని తరువాత ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. అందుకే పక్క రాష్ట్రం విషయాలు మనకెందుకులే అనే ఉద్దేశంతో ఇలా చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేటీఆర్ సమాధానం వింతగానే ఉందంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారని అడిగినందుకు ఆయన ఎటు చిక్కకుండా సమాధానం చెప్పడం గమనార్హం. ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే దాని మీద పలు చర్చలు నడుస్తున్నాయి. పందేలు కూడా కాస్తున్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని కొందరు అంటుంటే మరికొందరు వైసీపీ ప్రభుత్వమే వస్తుందంటున్నారు. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే.