KCR : ఏపీలో ఎవరు గెలుస్తారంటే.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

KCR

KCR

KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూలే ఇచ్చినా పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రెస్ మీట్లు పెట్టడమే తప్ప పెద్దగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది. ఈక్రమంలో కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఈమేరకు తాజాగా ఓ ప్రముఖ మీడియా చానల్ కు  ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘మీ పాత మిత్రుడు చంద్రబాబు గెలవాలా? యువకుడు, మీ సన్నిహితుడు జగన్ గెలవాలా? మీ పరిశీలనేంటి, మీ కోరిక ఏంటి? అన్న ప్రశ్నకు.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఏపీలో ఏం జరిగినా తమకు పట్టింపు లేదన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారన్నారు.

తమకు వస్తున్న సమాచారం ప్రకారం సీఎం జగనే మళ్లీ గెలుస్తారన్నారు కేసీఆర్. ఎవరు గెలిచినా తమకు బాధలేదన్నారు. ‘‘మీ పాయింట్ ఆఫ్ వ్యూలో , తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గెలిస్తే బావుంటుంది’’ అన్న ప్రశ్నకు చాలా హుందాగా బదులిచ్చారు కేసీఆర్. ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకుడిగా తాను చెప్పడం, ఒక పార్టీకి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు. వాళ్ల రాష్ట్రం, వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారన్నారు. తనకు అందిన సమాచారం మేరకైతే జగన్ మళ్లీ గెలుస్తాడని చెప్పానన్నారు.

ఈ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ జోక్యం ఉండబోదన్నారు. కానీ భవిష్యత్ లో మాత్రం పోటీ చేయవచ్చన్నారు. మొత్తానికి ఏపీలో మరోసారి జగన్ దే అధికారం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ ఖుషీగా ఉంటే.. కూటమి పార్టీల శ్రేణులు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నాయి. ఏదేమైనా ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు జూన్ 4న తెరపడనుంది.

TAGS