Ex CM Jagan : అధికారులను భయపెడుతూ వ్యవస్థాలను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం జగన్ కు చాలా ఈజీ అని ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగానే రుజువైంది. వైఎస్ఆర్ సీఎంగా ఉంటేనే లక్ష కోట్లకు పైగా సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ తన చేతిలోనే సీఎం పదవి ఉంటే ఏం చేయగలరో ప్రజల సొమ్ముతో ఇంకెంత జల్సాలు చేయగలరో రుషికొండ భవనాలను చూస్తే అర్థమవుతోంది.
వైఎస్ఆర్ మరణానికి ముందు ఆయనను అడ్డు పెట్టుకొని మంత్రులుగా పని చేసిన నాయకులను, ఆయా శాఖలకు చెందిన అధికారులను నయానో, భయానో ఒప్పించి తనకు అవసరమైన ఫైళ్లపై సంతకాలు పెట్టించుకొని నాయకులను, అధికారులను జైళ్లకు పంపించిన చరిత్ర జగన్ ది.
నిబంధనలకు విరుద్ధంగా, జగన్ కు అనుకూలంగా వ్యవస్థలను నాశనం చేశారన్న ఆరోపణలతో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఇక 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తూ, కొత్త వ్యవస్థలను సృష్టిస్తూ అసలు పాలన ఎలా ఉండద్దన్న భవిష్యత్ రాజకీయ నాయకులకు చెప్పారు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని కోల్పోవడంతో వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను తవ్వి తీస్తూ ఒక్కో వ్యవస్థలో అవినీతిని బయటకు తీస్తున్నారు అధికారులు. ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కుంటూ జగన్ చెప్పినట్టు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ సంతకాలు పెట్టిన అధికారులు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్లడానికి సిద్ధమయినట్లే.
ఇందులో ప్రభుత్వ అడ్వకేట్ గా పని చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ బేవరేజెస్ ఎండీ గా కొనసాగిన వాసుదేవ రెడ్డి, సీఐడీ ఐజీగా పని చేసిన సునీల్, ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేసిన ప్రవీణ్ ప్రకాశ్, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, మంత్రులు రోజా, కొడాలి నాని ఇలా జగన్ ఖాతాలో మొదటి దెబ్బ తినడానికి ఎవరు ముందుకు వస్తారో? తమ నాయకుడి కోసం ముందుకు వచ్చే సువర్ణ అవకాశం ఎవరికీ దక్కుతుందో అనే చర్చ ఊపందుకుంది.