BJP Alliance : కూటమిలోకి బీజేపీ వస్తే లాభం ఎవరికి? అసలు ఆ పార్టీలు ఏం కోరుకుంటున్నాయి?

Who will benefit if BJP joins the alliance?

Who will benefit if BJP joins the alliance?

BJP Alliance : మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఏపీ రాజకీయాలు కోలాహలంగా మారాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటికే పలు జాబితాల ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్తున్నారు. అలాగే సిద్ధం పేరుతో సభలు నిర్వహించి శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఓ అంచనాకు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులు ఫైనల్ చేసుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా పవన్ బీజేపీని కలుపుకోవాలని అంటూనే ఉన్నారు. దేశం మొత్తం మీద బీజేపీ అత్యంత బలహీనంగా ఉంది ఏపీలోనే. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. అయితే ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీ, జనసేనకు పెద్దగా కలిసివచ్చేది లేదు. అయినా ఎందుకు పొత్తు కోసం పాకులాడుతున్నాయనేదే ప్రశ్న.

వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగవని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థలను అదుపులో పెట్టుకున్న జగన్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతారని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరుగాలంటే కేంద్రం మద్దతు ఉండాలనుకుంటున్నారు. బీజేపీ మద్దతు తమకు లేకపోయినా.. వైసీపీకి మాత్రం ఉండొద్దని.. కనీసం న్యూట్రాల్ గానైనా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. అందుకే తాము హితులమే అని చెప్పడానికి చంద్రబాబు ప్రయతిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఉద్దేశం కూడా అదే.

బీజేపీతో పొత్తు వల్ల కూటమికి ఓట్ల పరంగా కలిసివచ్చే అవకాశం లేదు. పైగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పొత్తును వ్యతిరేకించే వర్గాలు ఆ పార్టీకి దూరమవుతాయి. టీడీపీ క్యాడర్ కూడా అసలు బలంలేని బీజేపీతో పొత్తులు పెట్టుకుని తర్వాత వారితో తామే గెలిపించామన్న మాటలు ఎందుకు పడాలన్న వాదన వినిపిస్తోంది. బీజేపీకి ఉన్న అర శాతం బీజేపీ ఓటర్లు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం కదా అని టీడీపీకి ఓట్లు వేయరనే అంచనా ఉంది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు కూడా టీడీపీకి వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నప్పుడు మంచి ఫలితాలే వచ్చాయి. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ పొత్తు బాగానే వర్కవుట్ అయ్యింది. రీసెంట్ గా అండమాన్ లో మేయర్ పోస్టును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించింది బీజేపీ. అక్కడ టీడీపీకి ఉంది రెండే రెండు సీట్లు అయినా మేయర్ సీటు ఇచ్చింది.

గతంతో పోలిస్తే బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షాలు దూరమయ్యాయనేది నిజం. బీజేపీ రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం ఉత్తరాదినే. హిందీ రాష్ట్రాల్లో 95 శాతం సీట్లు సాధించడం ద్వారానే ఢిల్లీ పీఠం బీజేపీకి దక్కింది. ఈ సారి అలా  జరుగకపోతే బీజేపీకి సీట్ల కోత తప్పదు. ఆ పార్టీకి దక్షిణాది నుంచి సీట్లు వచ్చేది అంతంత మాత్రమే. అందుకే ఇక్కడ బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలని చూస్తోంది. అందుకే టీడీపీ, జనసేన కూటమి వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

TAGS