AP Next CM 2024 : ఏపీలో మరో నెలన్నరలో ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ, జనసేనకు జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికలకు ఎన్నో ఈక్వేషన్స్ ఉన్నాయి. అందుకే పార్టీలు బలమైన వ్యూహాలను రచిస్తున్నాయి. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి, ఓటర్లను ఆకర్షించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనలు, మేనిఫెస్టోల తయారీతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. అయితే రాజకీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీల అనుకూల పత్రికలు, చానెళ్లు ఏవిధంగా కథనాలు వండివారుస్తున్నాయి? అనేది చూద్దాం..
2014లో ఏపీ పునర్విభజన తర్వాత ఏపీ పరిస్థితి గందరగోళంలో ఉంది. రాజధాని లేదు..నిధులు లేవు..ధనవంతులు ఉన్న పేద రాష్ట్రంగా మారిపోయింది. ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు లాంటి సీనియర్ నేతకే సాధ్యమని ఆయన్ను గెలిపించారు. ఆయన ఏదోలా చేసి సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నగర నిర్మాణంపై దృష్టి పెట్టారు. మంచి రాజధాని ఉంటేనే కంపెనీలు వస్తాయని, రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని ఆయన భావించారు. ఐదేళ్ల కాలంలో చేయాల్సిందల్లా చేశారు.
కానీ ఆ తర్వాత ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు ఘనవిజయం కట్టబెట్టారు ప్రజలు. ఉచితాలకు ప్రాధాన్యమిచ్చిన జగన్..కొన్ని విషయాలను మొత్తానికే పక్కకుపెట్టారు. టీడీపీ తీసుకొచ్చిన అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు. ఈ ఐదేండ్ల కాలం ఈ గొడవలతోనే సరిపోయింది. అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల బటన్లు నొక్కడమే తప్ప మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు..ఇలా ప్రజల భవిష్యత్ కు అక్కరకు వచ్చే అన్నింటిని పక్కనపెట్టి ఓట్లను రాల్చే సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమిచ్చారు.
ఇక 2024 ఎన్నికల్లో తమనే గెలిపించాలని జగన్, చంద్రబాబు కోరుతున్నారు. ఒకరేమో అమరావతి రాజధాని, మరొకరేమో విశాఖ రాజధాని స్టాండ్ తీసుకుని ఎన్నికల్లోకి వెళ్లిపోతున్నారు. వీరిలో ఎవరు వస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందో నిర్ణయించుకునే అవకాశం ప్రజలకు వచ్చింది. ఇక మీడియా రెండు వర్గాలుగా మారిపోయింది. వైసీపీకి సాక్షి, టీడీపీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5..సపోర్ట్ చేస్తూ రాస్తున్నాయి. సదరు నేత వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది..సంక్షేమం కొనసాగుతుంది..ఉచితాలు వస్తాయి..ఉద్యోగాలు వస్తాయి..అంటూ రాసుకొస్తున్నాయి. వీళ్ల రాతలు ఎలా ఉన్నా పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా, పెట్టుబడులు రాని రాష్ట్రంగా, ఉపాధి కల్పన లేని రాష్ట్రంగా ఏపీ బిక్కుబిక్కుమంటోంది. మరి ఏ నేత వస్తే రాష్ట్రం బాగుపడుతుంది? ప్రజలు బాగుంటారు? ప్రజల మనసులో ఏముంది? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.