Prajwal Revanna : జేడీఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యడు ప్రజ్వల్ రేవణ్ణ దేశం దాటి వెళ్లిపోయాడు. విదేశాల్లో తలదాచుకున్నాడు. ఆయన తప్పు చేసి భయంతో వెళ్లిపోయాడా ? లేదంటే తప్పు చేయకున్నా భయపడి పారిపోయాడా అనే విషయం ప్రజ్వల వస్తే కానీ నిజానిజాలు వెల్లడికావు. తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆయన బీజేపీ, జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీచేశారు. ఏప్రిల్ 26 న ఓటువేసి విదేశాలకు వెళ్లిపోయారు.
ప్రజ్వల్ పై లైగింక వేధింపులు, అత్యాచారం కేసులు నమోదయినాయి. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ అధికారులు సైతం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు విచారణ చేపడుతున్నట్టు లేఖ ద్వారా తెలిపారు. ఆయన పాస్ పోర్ట్ ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రిని కోరారు.
కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రజ్వల్ బీజేపీ మద్దతుతో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది. ఇప్పుడు ప్రజ్వల్ కేసు విషయంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థి స్వదేశం విడిచి వెళ్లడంతో బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారం నుంచి ఎలా బయట పడాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో పాస్ పోర్ట్ ను వెంటనే రద్దు చేయాలని కోరడం మరో సమస్య వచ్చి పడింది.
ప్రజ్వల్ ను స్వదేశానికి పిలిపించి చట్ట ప్రకారం వెళితే ఎలా ఉంటదనే ఆలోచనలో బీజేపీ ఢిల్లీ పెద్దలు పడ్డారు. ఒకవేళ సిట్ అధికారులు కోరినట్టుగా పాస్ పోర్ట్ ను రద్దు చేస్తే తలనొప్పి ఉండదు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కోర్ట్ వారంట్ తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రికి కూడా లేఖ రాసింది. వెంటనే స్పందించాలని కోరడంతో తదుపరి చర్యల గురించి సంబంధిత ఉన్నతాధికారులు సైతం ఆలోచిస్తున్నారు.
జేడీఎస్ తో పొత్తు లేకుంటే బీజేపీ కి ఈ ఇబ్బందులు వచ్చేవి కావు. పొత్తు ఉన్న నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం బీజేపీ తోపాటు జేడీఎస్ లను ఇరుకున పెట్టడానికి ప్రజ్వల్ కేసును ప్రధాన అస్త్రంగా తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. ఇప్పటికే కర్ణాటక లోని కొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వము పరిధిలో నడిచే సంస్థల ద్వారా నమోదయిన కేసులతో సతమతమవుతున్నారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి అవకాశం దొరికింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ప్రజ్వల్ కేసుతో బీజేపీ ని ఆడుకొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.