CM Revanth : తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. అధికారిక చిహ్నం మార్పుతో పాటు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు అని రాచరిక వ్యవస్థకు తావులేదన్నారు. తెలంగాణ తల్లి, గీతం స్ఫురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర గీతం బాధ్యతలను అందెశ్రీకి ఇచ్చామని తెలిపారు. అందెశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూప కల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సంగీత దర్శకుడు ఎంపిక విషయంతో తనకేం సంబంధం లేదని, రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యతంతా అందెశ్రీదేనని స్పష్టం చేశారు. తెలంగాణ చిహ్న రూపకల్పన బాధ్యత నిజామాబాద్ కు చెందిన వ్యక్తికి ఇచ్చామని సీఎం తెలిపారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు.