JAISW News Telugu

Nalgonda District : ఈ సారి నల్లగొండ జిల్లా ఎవరి సొంతం..!

Nalgonda District

Nalgonda District

Nalgonda District : ఉద్యమాలకు ఊపిరిలూదిన ప్రాంతం నల్లగొండ. నిజాం నవాబుల నుంచి దొరల పాలనను ఎదిరించిన గడ్డ. ఇక్కడ సమరం అంటే రాష్ట్రం ఉత్సుకతతో ఎదురు చూస్తుంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తం కుమార్ రెడ్డి, సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి యోధాను యోధులు ఇక్కడ బరిలో ఉన్నారు.

జిల్లాల్లోని 12 నియోజకవర్గాలలో తొమ్మిదింటిని గుప్పిట్లో ఉంచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కొంచెం వణుకుతున్నట్లు కనిపిస్తుంది. విశ్వాసం కోల్పోవడం, తెలంగాణ సమాజం మార్పు కోరుకోవడం తమకు ప్లస్ పాయింట్లు అవుతాయని కాంగ్రెస్ భావిస్తే.. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచామని తమకే పట్టం కడతారిని బీఆర్ఎస్ ధీమా గా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి బలం ఉందో.. ఎవరికి తగ్గిందో నియోజకవర్గాల వారీగా పరిశీలిద్దాం.

సూర్యాపేట
బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డికి కలిసి వచ్చిన నియోజకవర్గం. 2014, 2018 ఎన్నికల్లో ఆయన విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనతో రాంరెడ్డి దామోదర్ రెడ్డి తలపడనున్నారు. రెండు సార్లు జగదీష్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూసిన దామోదర్ రెడ్డి ఈ సారి ఎలాగైనా గట్టెక్కాలని చూస్తుంటే.. హ్యాట్రిక్ కోసం జగదీష్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. సంక్షేమమే గెలిపిస్తుందని మంత్రి నమ్మతుంటే. తనకు చివరి ఎన్నికలు, పైగా బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోవడం వంటి అంశాలతో ఈసారి తాను విజయం సాధిస్తానని దామోదర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావును లైట్ గా తీసుకోలేం. మాజీ ఎమ్మెల్యే అయిన ఆయనకు ఓటు బ్యాంకు గణనీయగానే ఉంది.

హుజూర్‌నగర్‌
ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పోటీ దారులు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక, 2019 ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ స్థానంలో బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణిని పోటీ చేయించగా ఆమె ఓడిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ బరిలో నిలిచిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని ఎదుర్కొనబోతున్నారు. ఇక్కడ కూడా పథకాలు, సంక్షేమం తనను గెలిపిస్తుందని సైదిరెడ్డి భావిస్తుంటే.. పాలక పార్టీ పార్పు, నియోజకవర్గంలో తనకు ఉన్న పట్టు గెలిపిస్తుందని ఉత్తం కుమార్ రెడ్డి ధీమాతో ఉన్నారు.

నల్గొండ
2018 ఎన్నికల్లో బీఆర్ఎన్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉద్దండ నేత  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ సారి కూడా వీరిద్దరే తలపడుతున్నారు. భువనగిరి ఎంపీగా ఉన్న వెంకట్ రెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. బీఆర్ఎస్ లో అసంతృప్తులను బుజ్జగించిన పార్టీ పెద్దలు భూపాల్ గెలుపునకు సంఘటితంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వెంకట్ రెడ్డి పూర్తి స్థాయి పట్టుతో కొనసాగుతున్నారు.

మునుగోడు
రాష్ట్రంలో హుజూరాబాద్ తర్వాత ఎక్కువ గుర్తింపు పొందిన నియోజకవర్గం మునుగోడు. 2018లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022లో బీజేపీలో చేరి తన పదవి, పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తలపడుతున్నారు. పార్టీలు మారుతున్నాడని కేడర్ లో కొంత అసంతృప్తి ఉన్నా అది పెద్దగా బయటకు రావడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని రాజగోపాల్ రెడ్డి భావిస్తుండగా.. అభివృద్ధి, సంక్షే ఫలాలు, సీఎం కార్డు తనకు కలిసి వస్తుందని ప్రభాకర్ నమ్ముతున్నాడు. ఇక మిగిలిన పార్టీలు అంతంత మాత్రమే ప్రభావం చూపవచ్చు.

తుంగతుర్తి
నియోజకవర్గంలో హ్యట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ పట్టుమీదున్నాడు. సంస్థాగతంగా బాగానే ఉన్నా.. అసమ్మతి మాత్రం కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ లో కొనసాగిన మందుల సామేలు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు. నియోజకవర్గంపై మంచి పట్టు, ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తు్న్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినా కాంగ్రెస్ శ్రేణులు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఆయన గెలుపునకు శక్తి కొద్దీ పోరాడుతున్నాయి.

నాగార్జునసాగర్‌
నియోజకవర్గంలో ఇప్పుడు వారసుల మధ్య విస్తృత పోరు జరుగుతుంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు భగత్ 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై విజయం సాధించారు. అయితే ఈ సారి జానారెడ్డి తన కొడుకు జయ్‌వీర్‌రెడ్డిని పోటీకి దింపారు. దీంతో ఇద్దరు నేతల వారసులు పోటా పోటీగా తలపడుతున్నారు. బీసీ కార్డు, సాగర్ లో ఇళ్ల క్రమబద్ధీకరణ తనకు కలిసి వస్తుందని భగత్ భావిస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్య పదవి దక్కుతుందని, దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రచారం చేస్తున్నారు.

మిర్యాలగూడ
వరుసగా రెండు ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే భాస్కర్ రావు హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉండడం కలిసి వచ్చే అంశం.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలుపునకు సహకరిస్తాయని అనుకుంటున్నారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి పురపాలక సంఘం కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి. సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేకతను అస్త్రాలుగా సంధిస్తున్నారు. సీపీఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ, ప్రధాన పార్టీలకు పోటీదారుగా మారారు.

కోదాడ
ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి ఎన్ పద్మావతి రెడ్డి మధ్య ప్రముఖంగా పోటీ ఉంది. సుడగాలి పర్యటనలో మల్లయ్య జోరు పెంచుతున్నారు. అయితే పార్టీ కేడర్ ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మారెడ్డి విజయానికి ఎంపీ ఉత్తం కుమార్ రెడ్డి పావులు వ్యూహాలు రచిస్తున్నారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలుస్తామని ఆమె బలంగా నమ్ముతుంది.

భువనగిరి
ఈ నియోజకవర్గంలో ప్రధానంగా త్రిముఖ పోరు కనిపిస్తుంది. రెండు ఎన్నికల్లో గెలిచిన పైళ్ల శేఖర్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంగా ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసి రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ బలం, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీల మార్పు వ్యవహారం కేడర్ ను కొంత అయోమయానికి గురి చేస్తుంది.

ఆలేరు
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గొంగడి సునీత రెండు సార్లు గెలిచారు. ఈ సారి కూడా ఆమెనే బరిలో నిలిచారు. యాదాద్రి ఆలయం డెవలప్ మెంట్, తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. కానీ ఆమెపై అసంతృప్తితో కొందరు నేతలు పార్టీ మారారు. ఇది ఆమెకు కలిసి రాకపోవచ్చు. కాంగ్రెస్ నుంచి బీర్ల ఐలయ్య తన గెలపునకు తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. సామాజిక వర్గం మద్దతు, పార్టీ కేడర్ బలంగా ఉండడంకూడా తనకు సానుకూల అంశాలని విశ్వసిస్తున్నారు.

నకిరేకల్‌ (ఎస్సీ)
గత ఎన్నికల్లో (2018)లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ చేరారు చిరుమర్తి లంగయ్య. ఇప్పుడు ఆయనే మరోసారి బీఆర్ఎస్ తరుఫున బరిలోకి దిగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తనను గెలిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకున్నాడు. పాలక పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇక్కడ మంచి పట్టు ఉండడం కూడా వీరేశంకు కలిసి వచ్చే అంశం.

దేవరకొండ (ఎస్టీ)
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ హ్యట్రిక్ (2004, 2014, 2018) దక్కించుకొని నాలుగో సారి గెలుపొందాలని అనుకుంటున్నాడు. అయితే ఆ పార్టీ నేతలు ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వచ్చేలా కనిపించడం లేదు. అభివృద్ధిపై కొంత నమ్మకం ఉంటే గిరిజన ఓట్లపై మరికొంత నమ్మకం పెట్టుకున్నారు. కాంగ్రెస్ తరుఫున మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలూ నాయక్‌కు బరిలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంపై పట్టు ఉండడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో లుకలుకలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు.

Exit mobile version