KTR : మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా, రైతు రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ సర్కారుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ ప్రభుత్వ పాలనై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరని కేటీఆర్ నిలదీశారు. రైతుబంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు..? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు..? అవ్వ, తాతలకు నెలకు రూ.4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు..? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగా వీరుడు ఎవరు..? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ కు తెరతీసిన ఘనుడు ఎవరు..? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.