Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులెవరు..? – కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం లేఖ
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులెవరో అనేదా నిర్ధారించాల్సిన పరిస్థితి రాష్ట్ర నీటిపారుదల శాఖకు వచ్చింది. ఉత్తరాఖండ్ లో దాఖలు చేసిన ఓ టెండర్ లో ఎల్ అండ్ టీ అండర్ టేకింగ్ ఇచ్చింది. అందులో మేడిగడ్డ గురించి కూడా ప్రస్తావించిందా. అయితే మేడిగడ్డ బ్యారేజీ స్ట్రక్చర్ దెబ్బతిందని, ఈ పని ఎల్ అండ్ టీ చేసిందని పత్రికల్లో చూశామని, ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యత ఉందో లేదో చెప్పాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. పనికి సంబంధించి ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం సరైందో కాదో తెలుపాలని కోరింది.
ఉత్తరాఖండ్ లో గౌలా నదిపై జమ్రాని డ్యాం నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26న టెండర్ పిలిచింది. అందులో 150.6 మీటర్ల ఎత్తుతో కాంక్రీటు గ్రావిటీ డ్యాం నిర్మాణం, అనుబంధ పనులకు ఎల్ అండ్ టీ టెండరు దాఖలు చేసింది. దీంతో పాటు తాము చేపట్టిన ప్రాజెక్టులలో వైఫల్యాలు చెందిన చరిత్ర లేదని పేర్కొంది. ఈ అఫిడవిట్ తో పాటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన వివరాలను సమర్పించింది.