Ratan Tata : భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ఇప్పుడు ఈ లోకాన్ని విడిచారు. 86 ఏళ్ల వయసులో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. టాటా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. ఆయన మృతి కార్పొరేట్లతో పాటు సాధారణ మధ్య తరగతి ప్రజలను కూడా కలచి వేస్తున్నది. అలాగే రతన్ టాటా తర్వాతి వారసుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు జనాల్లో నెలకొంది. 3800 కోట్ల ఆస్తికి వారసులెవరు?
టాటా వారసుడు ఎవరు?
రతన్ టాటా ఎవరినీ పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలిసిందే. అతనికి పిల్లలు లేరు. అయితే రతన్ టాటా ఆస్తికి వారసుడు ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం వారసుల్లో రతన్ టాటా సవతి తల్లి కొడుకు, సోదరుడు నోయెల్ టాటా అగ్రస్థానంలో ఉన్నారు. రతన్ టాటా తండ్రి నావల్ టాటా రెండో భార్య సిమోన్‌కు నోయెల్ టాటా జన్మించాడు. కుటుంబంలో భాగం కావడంతో వారసుల్లో నోయెల్ టాటా పేరు పెద్ద ఎత్తున మార్మోగుతోంది. నోయల్ టాటాకు ముగ్గురు పిల్లలు. వారిలో మాయా టాటా, నెవిల్లే టాటా, లియా టాటా. రతన్ టాటా ఆస్తికి వారసుల అవకాశం ఉన్న వారిలో వీరు కూడా ఉన్నారు.
నోయెల్ టాటా పిల్లలు ఏం చేస్తున్నారు?
నోయెల్ టాటా ముగ్గురు పిల్లలు ప్రస్తుతం టాటా గ్రూప్‌లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాయా టాటా(34).. టాటా ఆపర్చునిటీస్ ఫండ్.. టాటా డిజిటల్‌లో పాత్రలు నిర్వహించారు. టాటా కొత్త యాప్‌ను ప్రారంభించడంలో చాలా సహకారం అందించారు. 32 ఏళ్ల నెవిల్లే, ప్రముఖ హైపర్ మార్కెట్ చైన్ స్టార్ బజార్ అయిన టాటా ట్రెంట్ లిమిటెడ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. లియా టాటా(39) టాటా గ్రూప్ హాస్పిటాలిటీ రంగాన్ని చూసుకుంటున్నారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్‌లను చూసుకుంటున్నారు. ఆమె ఇండియన్ హోటల్ కంపెనీని కూడా పర్యవేక్షిస్తుంది.