JAISW News Telugu

Nimisha Priya : అసలు ఎవరీ నిమిషా ప్రియ.. ఆమెకు యెమెన్ ఎందుకు ఉరి శిక్ష విధించింది?

Nimisha Priya

Nimisha Priya

Nimisha Priya : యెమెన్ లోని భారతీయ నర్సు నిమిషా ప్రియ పెట్టుకున్న ఉరిశిక్ష రద్దు అప్పీల్ ను అక్కడి కోర్టు నిరాకరించింది. ఆమె ఉరికంభం ఎక్కాల్సిందేనని అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో అసలు నిమిషా ప్రియ ఎవరు? ఆమెకు అక్కడి కోర్టులు ఎందుకు ఈ శిక్ష విధించాయి అని తెలుసుకుందాం.

అయితే ఆమెను ఉరికంభం నుంచి రక్షించేందుకు ఆమె తల్లి ఇటీవల ఢిల్లీ హైకోర్టును కోరింది. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఘటనలో నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలంటూ ఆమె అక్కడి సుప్రీం కోర్టును అభ్యర్థించగా విచారణ జరిపిన కోర్టు ఆమె అప్పీల్ ను నవంబర్ 13వ తేదీ కొట్టివేసిందని ఆమె తల్లి ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం ఇప్పుడు యెమెన్ అధ్యక్షుడిదే అని ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది.

బ్లడ్ మనీ చెల్లించి బాధితుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో కుటుంబంతో చర్చలు జరిపేందుకు యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ నిమిషా ప్రియ తల్లి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. యెమెన్‌ వెళ్లాలన్న అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది.

అరబ్ కంట్రీ అంతర్యుద్ధం నేపథ్యంలో 2017 నుంచి ఇండియన్స్ పై నిషేధం ఉంది. అయితే ఇటీవల జరిగిన దౌత్య సంబంధాల దృష్ట్యా నిర్ధిష్ట కారణాలు, పరిమిత వ్యవధి కోసం ఇండియన్స్ ఆ దేశం వెళ్లేందుకు అనుమతి ఉందని కేంద్రం తరుఫు న్యాయవాది హై కోర్టుకు తెలిపారు.

ఎవరీ నిమిషా ప్రియా..
కేరళలోని పలాక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ 2014లో తన భర్త థామస్, కూతురుతో కలిసి యెమెన్ వెళ్లింది. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆమె భర్త, కూతురు అదే ఏడాది ఇండియాకు వచ్చారు. కానీ నిమిషా ప్రియ అక్కడే ఉంటూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నర్సుగా పని చేస్తుంది. తను ఒక క్లినిక్ పెట్టుకోవాలని అనుకుంది. ఇందుకు తన భర్త స్నేహితుడు యెమెన్ దేశస్తుడు తలాల్ అబ్దో మహదీ సాయం కోరింది. (యెమెన్ లో సొంత బిజినెస్ పెట్టుకోవాలంటే ఆ దేశ వాసుల హామీ ఉండాలి).

అందుకే ఆమె తలాల్ ను సాయం చేయాలని కోరింది. కానీ అతడు సాయం చేయలేదు. ఇక చేసేది లేక ఆమె మరో వ్యక్తి సాయం కోరింది. అతని హామీ మేరకు క్లినిక్ ను 2015లో ప్రారంభించింది. రాను రాను ఆమెకు ఆదాయం పెరుగుతుండడంతో తన సంపాదనలో కొంత తనకు ఇవ్వాలని తలాల్ అబ్దో మహదీ పట్టుబట్టాడు. కొంత కాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కొడవ పెద్దదైంది.

ఈ నేపథ్యంలోనే ప్రియా తన భార్య అంటూ నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి ఆమెను వేధించడం ఎక్కువ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె 2016లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తలాల్ అబ్దో మహదీని పోలీసులు అరెస్ట్ చేయగా.. కొంత కాలం జైలులో ఉన్న ఆయన తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. తర్వాత ప్రియను కలిసి ఆమె పాస్ పోర్ట్ ను లాక్కున్నాడు.

హత్య ఎలా జరిగిందంటే?
తలాల్ అబ్దో మహదీ ప్రియా పాస్ పోర్ట్ లాక్కోవడంతో ఆమె చాలా ఇబ్బందులు పడింది. చాలా సార్లు తన పాస్ పోర్ట్ తనకు ఇవ్వాలని కోరింది. అయినా ఆయన వినలేదు. ఈ నేపథ్యంలో 2017లో తన పాస్ పోర్ట్ ఎలాగైనా తీసుకోవాలని అనుకొని తలాల్ అబ్దో మహదీకి మత్తమందు ఇంజక్షన్ చేసింది. అది కాస్తా ఓవర్ డోస్ కావడంతో తలాల్ అబ్దో మహదీ మరణించాడు.

ఏ చేయాలో తెలియక తను క్లినిక్ ఏర్పాటు చేసుకోవడంలో సాయపడిన అబ్దుల్ హనంను పలిచింది. తర్వాత తలాల్ అబ్దో మహదీ మృతదేహాన్ని కట్ చేసి వాటర్ ట్యాంక్ లో వేసింది. నీరు స్మెల్ వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలాల్ అబ్దో మహదీ శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తు క్రమంలో ప్రియతో గొడవలు, జైలుకు వెళ్లడం, బయటకు రావడాన్ని పోలీసులు తెలుసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. 2017లో యెమెన్ కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018లో ఆ శిక్షను మరణ శిక్షగా మార్చింది.

అయితే తన కూతురును మరణశిక్ష నుంచి తప్పించేందుకు తల్లి తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో మాట్లాడింది. వారు ‘బ్లడ్‌మనీ’ (పరిహారం) కింద రూ.70 లక్షలు డిమాండ్ చేశారు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని తగ్గించాలని కోరింది. దీనికి తలాల్ కుటుంబం ఒప్పుకోలేదు. ఇక యెమెన్ లోని ప్రవాస భారతీయులు ‘సేవ్ నిమిషా ప్రియా’ పేరిట విరాళాలు సేకరించారు. ఇది కూడా కొంత మొత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ డబ్బును వారికి అప్పగించి తన బిడ్డను తెచ్చుకోవాలనుకుంటుంది. అందుకే కోర్టును అభ్యర్థించింది.

Exit mobile version