Telangana Politics : కేసీఆర్ తో టచ్ లో ఉన్నవారు ఎవరు? తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు..

Telangana Politics

Telangana Politics KCR Comments Viral

Telangana Politics : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల రాజకీయం ఇప్పుడిప్పుడే స్పీడందుకుంటోంది. ఈ ఎన్నికలు ప్రధానంగా రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తన సత్తా చాటాలని రేవంత్ భావిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ మునపటి వైభవం తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్న వేళ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతాయనే సంకేతాలు ఆయన ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని కొత్త చర్చకు దారితీశారు.

తమ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెప్పడం కలకలం రేపుతోంది. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి రెండు లేదా మూడు రోజులకొకసారి వచ్చి స్టేట్ మెంట్లు ఇస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. మూడు నెలల్లో ఈ ప్రభుత్వం పోతుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటూ బీజేపీ నేత లక్ష్మణ్ కూడా స్టేట్ మెంట్ ఇవ్వడంపైనా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రే పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంటే ఒక్క రోజు కూడా రేవంత్ ఖండించలేదని కేసీఆర్ అంటున్నారు. ప్రధాని మోదీ ఏదో కార్యక్రమానికి వస్తే, ఆప్ బడే భాయ్ హై.. మై చోటీ భాయ్ హై అనడంపైన కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో కొందరిలో అనుమానాలు మొదలయ్యాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ఉన్న కొందరు మీరు, మేము కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని తమ నేతల వద్దకు ప్రతిపాదనలు వచ్చాయని కేసీఆర్ చెబుతున్నారు. ఆ సమాచారం తనకు వచ్చిందన్నారు. అయితే వాళ్లు ఎవరనేది చెప్పేందుకు కేసీఆర్ నిరాకరించారు.

అయితే గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో చేసిన ఇలాంటి వ్యాఖ్యలపైన రేవంత్ ఘాటుగా స్పందించారు. తాను జానారెడ్డి, జైపాల్ రెడ్డిని కాదని.. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఇదే అంశంపైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

TAGS