Telangana Congress : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో బిజీబిజీగా మారిపోయాయి. అభ్యర్థుల ఎంపికలో అధికార కాంగ్రెస్ పార్టీ అచితూచి అడుగులు వేస్తోంది. మిగతా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా, గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాల్లో గెలిచి రాహుల్ ను ప్రధాని చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో 17 స్థానాలకు గాను నాలుగు సీట్లలో అభ్యర్థులను ప్రకటించగా, నేడు మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేస్తుండగా టికెట్లు ఎవరెవరికీ దక్కుతాయనే ఉత్కంఠ ఆ పార్టీలో నెలకొని ఉంది. లోక సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి సీఈసీ నేడు, రేపు భేటీ కానుంది. ఇప్పటికే 82 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం ఇప్పుడు 3వ జాబితాను ప్రకటించనుంది.
ఈ భేటీలోనే తెలంగాణలో గతంలో ప్రకటించిన స్థానాలకు మినహాయించి, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనుంది. దీని కోసం పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇదే సమావేశంలో ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టోపై కూడా చర్చించి ఆమోదం తెలుపనున్నారు.