Siddipet News : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తుండగా ఓ రాతి కుండలో వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఉపాధి పనుల్లో భాగంగా పొలాలకు వెళ్లే కాల్వలు తవ్వుతున్న సమయంలో ఓ మహిళకు చిన్న రాతి కుండ దొరికింది. దానిని తెరిచి చూడగా లోపల వెండి నాణేలు, ఉంగరాలు కనిపించాయి.
కూలీలు వెంటనే పంచాయతీ కార్యదర్శి భాస్కర్ కు విషయం తెలియజేయగా ఆయన ఇచ్చిన సమాచారంతో చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు తహసీల్దారు అనంతరెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్ అక్కడికి చేరుకున్నారు. అందరి సమక్షంలో రాతి కుండలోని నాణేలను లెక్కించారు. 20 వెండి నాణేలు, 2 వెండి వెండి ఉంగరాలు ఉన్నాయి. అవి 238 గ్రాముల బరువు ఉన్నాయి. నాణేలపై పర్షియన్ భాషలో రాసి ఉన్నాయి. ఇవి అసఫ్ జాహీల కాలంనాటి నాణేలని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అధికారులు వాటిని కలెక్టర్ కార్యాలయానికి పంపించారు.