TANA Election : తానా ఎన్నికల్లో ఏ టీము విజయం సాధిస్తుందో?
TANA Election : అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ తానా. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 46 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అక్కడ స్థిరపడిన వారి కోసం తానా పని చేస్తుంది. గతంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకున్న తానా మొదటి సారిగా ఎలక్ర్టానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారా పోలింగ్ నిర్వహించింది.
డిసెంబర్ 25 వరకు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. కొడాలి, వేమూరి టీములు ఈ ఎన్నికల్లో తలపడ్డాయి. డిసెంబర్ 26న ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిపారు. కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 27న బ్యాలెట్స్ బాక్సులు తానాకు చేరాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయినట్లు చెబుతున్నారు.
రెండు ప్యానెల్స్ పంపిన మాస్ ఈ మెయిల్స్ దెబ్బకి ఓటర్లు సహనం కోల్పోయారు. పది నిమిషాల వ్యవధిలో పది క్యాంపెయిన్ ఈమెయిల్స్ రావడంతో ఓటర్లు ఎటూ తేల్చుకోలేకపోయారు. రెండు ప్యానెల్స్ తమ అనుయాయులతో ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నించారు. పోలింగ్ జనవరి 2 తరువాత ఊపందుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సెలవులకు ఇండియా వెళ్లడంతో ఓటు వేయలేకపోయారు.
కెనడా, అమెరికాలో ఉన్న వారు మాత్రం ఓట్లు వేయగలిగారు. వచ్చే వారంలో ఇలా ఓటు వేయలేని వారితో ఓట్లు వేయించాలని చూస్తున్నారు. ఇప్పటివరకు 40 వాతం ఓట్లు పోలయినట్లు అంచనా వేస్తున్నారు. చివరి తేదీ జనవరి 17 కావడంతో 50 శాతానికంటే ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చేయాలని చూస్తున్నారు. అట్లాంటా, అపలాచియన్, వర్జీనియా ప్రాంతాల్లో తమకు పట్టు ఉందని కొడాలి టీం ధీమాతో ఉంది.
ఒహాయో, ఆస్టిన్, హ్యూస్టన్, న్యూయార్క్, డల్లాస్ లాంటి ప్రాంతాల్లో తమకు మెజార్టీ లభిస్తుందని వేమూరి ప్యానల్ భావిస్తోంది. కొడాలి నుంచి తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి నరేష్ కొడాలికి మెజార్టీ వస్తుందని కొందరు నమ్ముతున్నారు. క్రాస్ ఓటింగ్ బెడద కూడా ఉందని భయపడుతున్నారు. వేమూరి ప్యానల్ లో క్రాస్ ఓటింగ్ ద్వారా అశోక్ కొల్లా, శిరీష తూనుగుంట్ల, శశాంక్ యార్లగడ్డకి వస్తాయని చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆత్మవిశ్వాసం రోజులు గడిచే కొద్దీ పోతోంది. అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో తానా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారు. జనవరి 18న కౌంటింగ్ పూర్తయితే ఎవరి అంచనాలు ఫలిస్తాయో ఎవరి అంచనాలు తారుమారవుతాయో తెలియదు. ఏది ఏమైనా తమ ప్యానలే గెలుస్తుందని రెండు టీములు చెబుతున్నాయి.