AP Volunteers : ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఏ విధంగా వ్యవహరించనుందనేది గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవడంతో.. వాలంటీర్ల భవిష్యత్తు ఏమిటనేది ఆందోళన రేపింది.
వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా? లేదా? అనేది నేడు స్పష్టత రానుంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై చర్చ జరగనుంది. వైసీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి వీరాంజనేయులు సమాధానం ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనం పెంచుతామని చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని స్పష్టం చేశారు. అలాగే వలంటీర్లకు గౌరవ వేతనం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి పక్కన పెడితే.. వాలంటీర్లుగా కొనసాగుతున్న వారికి పింఛన్లు, ఇంటింటికీ పంపిణీ కాకుండా ఇతర బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.