Medaram Jathara : చిలకలగుట్టపై సమ్మక్క తల్లి ఎక్కడుంటుంది? ఏంటా రహస్యం!
Medaram Jathara : మేడారం జాతర రేపు మొదలుకాబోతోంది. రేపు సాయంత్రం సారలమ్మ రాకతో జాతర వైభవం ప్రారంభమవుతుంది. గురువారం సమ్మక్క ఆగమనంతో జాతర తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ మూడు రోజులు కోటిన్నర భక్తులతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోనున్నాయి.
మేడారం జాతరలో చిలకలగుట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అసలు చిలకలగుట్టపై సమ్మక్క తల్లి ఎక్కడ ఉంటుంది? ఎందుకు ఎవరూ ఆ గుట్టపైకి వెళ్లే సహసం చేయరు? చిలకలగుట్టపైన కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కకు సంబంధించిన రహస్యాన్ని సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ మీడియాకు వివరించారు.
మేడారం మహా జాతరలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను అధికారిక లాంఛనాలతో ఉన్నతాధికారులు తుపాకులతో గాలిలో కాల్పులు జరిపి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ చిలకలగుట్టపైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకొస్తారు. మళ్లీ రెండేళ్ల వరకు గుట్ట ప్రాంతం నిషేధిత ప్రాంతంగానే ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. అమ్మవార్లను తీసుకొచ్చే పూజారులు కూడా అక్కడకు వెళ్లలేరు.
వారం రోజుల పాటు అమ్మవారిని అవాహనం చేసిన తమకు చిలకలగుట్టపై మార్గం కనిపిస్తుందని, మిగతా రోజుల్లో ఎవరికి ఆ మార్గం కనిపించదని.. ఇదే చిలకలగుట్టపై సమ్మక్క అసలు రహస్యం అని చెబుతున్నారు. చిలకలగుట్టపై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప, మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని, మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాటను చూపిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరు చిలకలగుట్టపై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారని, జాతర సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా గిరిజన సంప్రదాయాలను, నియమ నిష్టలను తప్పి అక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని, ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందేనన్నారు.