Pavan Kalyan Contest : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ..ఈ పేరు చెబితేనే యూత్ ఊగిపోతుంటారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయనతోనే నడుస్తూ ఉంటారు. ఇక రాజకీయాల్లో కూడా అంతే. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయినా ఆయన పొలిటికల్ ఇమేజ్ రవ్వంత కూడా తగ్గలేదు. సరికదా ఆయన తన క్యాడర్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. జయాపజేయాలకు అతీతమైనది పవన్ పై తమ అభిమానమని ఫ్యాన్స్ చెబుతుంటారు.
అయితే ఇప్పుడు అందరిలోనూ చర్చకు వచ్చేది ఏంటంటే.. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..అనే విషయమే. లోకేశ్ ,చంద్రబాబు వారి నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటికీ ప్రకటించలేదు. ఎక్కడా ప్రచారం కూడా చేయడం లేదు. గతంలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. రాబోయే ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలే సమయం ఉంది. మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తారా? లేదా తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడలను ఎంచుకుని పోటీ చేస్తారా? అనే విషయం ఇంతవరకు తేల్చడం లేదు.
చంద్రబాబు, పవన్ ఇద్దరూ జగన్ ను గద్దె దించే ఏకైక లక్ష్యంతోనే కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కూటమి సీట్ల పంపకాలపై చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అభ్యర్థులకు దీటుగా కూటమి అభ్యర్థులను బరిలో దించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక పవన్ ఎక్కడ పోటీ చేయాలనే విషయం దాదాపు చర్చకు రావొచ్చు. పవన్ కూడా తాను ఎక్కడ పోటీ చేయదలిచింది నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.
పార్టీ అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత లిస్టుల వారీగా పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే తాను ఎక్కడ పోటీ చేస్తాననేది చెబుతారు కావొచ్చు అని తెలుస్తోంది. తాను పోటీ చేసే నియోజకవర్గంపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తుండవచ్చు అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే జనసైనికుల్లో మాత్రం తమ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారోననే ఉత్కంఠ అయితే ఉంది. గతంలో జరిగినట్టుగా ఈసారి జరుగకుండా చూసుకునే బాధ్యత తమది అన్నట్టుగా వారి ఆలోచన. పవన్ ఒక్కచోట పోటీ చేసినా..రెండు చోట్ల పోటీ చేసినా ఆయన ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఏ నియోజకవర్గాలో ముందే తేలితే.. ఇప్పటి నుంచే నియోజకవర్గంలోని ప్రతీ ఊరు.. ప్రతీ ఇల్లు తిరిగి పవన్ ఘన విజయం సాధించేలా చూసుకుంటామని వారు నమ్మకంగా చెబుతున్నారు.