Pinnelli Ramakrishna : ఈవీఎంలను ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. ఆయన తరుపున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పిన్నెల్లి నేరుగా నర్సరావుపేట కోర్టులో స్వయంగా లొంగిపోతారంటూ ప్రచారం జరగడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పిన్నెల్లి కోసం ఎస్పీ, డీఎస్పీ లతో కలిసి ఎనిమిది బృందాలు గాలిస్తున్నామని సీఈవో ముకేశ్ మీనా ప్రకటించారు.
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎం లను ధ్వంసం చేసిన కేసులో అసలు నిందితుడిని పట్టుకోలేకపోయిన అధికారులు.. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పోలింగ్ కేంద్రంలోని పీఓ, ఏపీఓ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాచర్ల నియోజకవర్గం లో టీడీపీ నేతలపై దాడులు చేస్తూ వారిని అంతమొందించడానికి.. వారు చేసిన విధ్వంసాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ విధ్వంసకాండకు టీడీపీ నేత బోండా ఉమా ఆయన అనుచరులు కూడా బాధితులే. గతంలో పిన్నెల్లి.. బోండా ఉమా కారు పై ఐరన్ రాడ్లతో దాడి చేసి.. ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు ‘మాచర్ల రౌడీ’గా చెలామణి అయి.. ఇప్పుడు ‘పరారీలో ఉన్న ఖైదీ’ మాదిరి పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు పిన్నెల్లి. ఖర్మ ఎప్పటికైనా ఎవరినీ విడిచి పెట్టబోదని అంటున్నారు టీడీపీ నాయకులు. పోలింగ్ రోజే ఇంత అరాచకం సృష్టించిన పిన్నెల్లి.. తర్వాత ఎన్నికల్లో గెలిస్తే ఇంకెన్ని అరాచకాలకు పాల్పడుతాడో అని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి పిన్నెల్లి ని అరెస్టు చేయలేకపోతే ఇక కౌంటింగ్ రోజు మాచర్లలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోవచ్చు. ఇంత జరుగుతున్నా ఇంకా ఆయనను సమర్థిస్తూ అనేకమంది వైసీపీ నేతలు మీడియా ముందుకొస్తున్నారు. ఇంకెన్నాళ్లు అరాచకానికి వైసీపీ అండగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు.