JAISW News Telugu

Anantapadmanabudu : అమరావతిలో అనంతపద్మనాభుడు.. ఎక్కడ కొలువై ఉన్నాడంటే?

Anantapadmanabudu

Anantapadmanabudu

Anantapadmanabudu : ‘ఉండవల్లి’ అంటే తెలుగు వారందరికీ వెంటనే గుర్తొచ్చేది  గుహలు. నాలుగు అంతస్తుల అందాన్ని సృష్టించడానికి ఒక పర్వత శ్రేణిని తొలిచారు. ఇక్కడ నాలుగు అంతస్తుల్లో ఆలయాలు నిర్మించారు. పెద్ద గ్రానైట్ రాయితో చెక్కిన 20 అడుగుల ఏకరాతి ‘అనంత పద్మనాభ స్వామి’ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించిన  ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి హస్తకళ అజంతా ఎల్లోరా కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. గుప్త నిర్మాణ శైలికి సంబంధించిన తొలి సాక్ష్యాలలో ఇవి ఒకటి. ఈ గుహలు క్రీ.శ. 420 నుండి 620 వరకు విష్ణుకుండినుల కాలానికి చెందినవి.

ఈ గుహలు.. మొదట బౌద్ధమతానికి సంబంధించినవి. తరువాత అవి క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హిందూ శిల్పాల కలయిక. ఈ నాలుగు అంతస్థుల గుహ సముదాయం మొదట బౌద్ధ సన్యాసుల నివాసంగా ఏర్పాటు చేయబడిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

ఏ అంతస్తులు ఉన్నాయి?
ఈ నాలుగు అంతస్థుల గుహలలో మొదటి అంతస్తులో రుషులు, సింహాలు మొదలైన విగ్రహాలు ఉన్నాయి. గోడలపై నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు.. ఇంకా కొన్ని విగ్రహాలు చెక్కబడ్డాయి. స్తంభాలపై కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి. రెండవ అంతస్తులో ‘అనంత పద్మనాభస్వామి’ శయన విగ్రహం ఉంది. గర్భగుడి ద్వారం వద్ద జయ విజయుల విగ్రహాలు ఉన్నాయి. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మించబడని త్రికూటాలయం ఉంది. అందులో విగ్రహాలు లేవు.

గుహల నుండి రహస్య మార్గాలు..
గుహల నుంచి కొండవీటి కోట, మంగళగిరి కొండ, విజయవాడ కనకదుర్గ గుడి వరకు రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు. పూర్వం రాజులు తమ సైన్యాలను శత్రువులకు తెలియకుండా ఈ మార్గాల గుండా తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడ సొరంగం మూసుకుపోయి దుమ్ముతో నిండిపోయింది.

ఎలా చేరుకోవాలి..?
ఉండవల్లి గుహలను గుంటూరు, విజయవాడ నగరాల నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరు నుండి 30 కి.మీ, విజయవాడ నుండి ఆరు కి.మీ. గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్ర రహదారి మీదుగా ఉండవల్లి జంక్షన్‌కు చేరుకుంటారు. ఎడమవైపుకు తిరిగి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు కనిపిస్తాయి. విజయవాడ నుంచి వచ్చే వారు.. ప్రకాశం బ్యారేజీ దాటి ఉండవల్లి జంక్షన్‌కు చేరుకుని కుడివైపున మూడు కిలోమీటర్లు వెళ్తే ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చు.

సందర్శన గంటలు
సందర్శకులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం.

Exit mobile version