Vijayamma : విజయమ్మ అలియాస్ వైఎస్ విజయలక్ష్మి రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతీ అడుగులో ఆయన విజయం వెనుక ఆమె పాత్ర అమోఘం. వైఎస్ఆర్ రాజకీయ అరంగేట్రం నుంచి ఇటు కుటుంబాన్ని అటు భర్తను రెండు కళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న ఆదర్శ భార్య, తల్లి. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఖరి నచ్చక బయటకు వస్తే కొడుకును దీవించింది. అప్పుడే వైఎస్ఆర్ పార్టీ పురుడు పోసుకుంది. ఆ పార్టీకి వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా.. కొడుకు జగన్ అధ్యక్షుడిగా ఉండి ముందుకు నడిపారు. తక్కువ సమయంలోనే పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చారు.
జగన్ అరెస్ట్‌తో..
మనీ లాండరింగ్ కేసులో జగన్ అరెస్ట్ కావడంతో పార్టీ బాధ్యతను తల్లి విజయమ్మతో పాటు చెల్లి షర్మిల భుజానికి ఎత్తుకుంది. ఓదార్పు యాత్ర పేరిట పాదయాత్ర చేశారు. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన జరిగింది. 16 నెలలు జగన్ జైలులో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని తల్లి, చెల్లి ప్రచారం చేశారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ఈ అవకాశాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. దీంతో 2014 ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకున్న వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
2019లో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రచారానికి మరింత ఉరకలెత్తించింది. బైబై బాబు అంటూ.. టీడీపీని మట్టి కరిపించి వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యారు. అన్న తనకు ఏదైనా మంచి పదవే ఇస్తారనుకున్న షర్మిలకు భంగపాటు ఎదురైంది. తెలంగాణలో షర్మిల 2021లో వైఎస్సార్ టీపీని స్థాపించింది. ఈ సమయంలో కూతురుకు అండగా విజయమ్మ నిలిచారు. తన బిడ్డను ఆదుకోవాలని ప్రజలను కోరింది.
కాంగ్రెస్‌లో విలీనం..
ఏ పార్టీ అయితే తన తండ్రి మరణం అనంతరం కుటుంబాన్ని రోడ్డున పడేసిందో.. అదే పార్టీలో షర్మిల చేరారు. తన పార్టీ వైఎస్సార్‌టీపీని ‘హస్తం’లో విలీనం చేశారు. జనవరి 4న ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. పార్టీ జనవరి 16న ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఇక, ఇప్పుడు విజయమ్మ ఎటువైపు ఉంటారన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. భర్త చావు, కొడుకు జైలుకు వెళ్లేందుకు కారణమైన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందా? లేక కొడుకుతో ఉంటారా అన్న చర్చ జరుగుతోంది.
కూతురువైనే మొగ్గు!
బహిరంగ సభల్లో జగన్ ను ఉద్దేశించి ‘మీ బిడ్డ.. మీ బిడ్డ’ అని ప్రసంగించే విజయమ్మను జనగ్ దూరం చేసుకున్నారు. షర్మిల పార్టీ స్థాపించిన తర్వాత విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసింది. కూతురు తెలంగాణలో పెట్టిన వైఎస్ఆర్ టీపీకి మద్దతుగా పాదయాత్రలో పాల్గొంది. ఆ సమయంలో కూతురితో మరో రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు. కానీ ఇటీవల కూతురు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా రావడంతో ఇద్దరి మధ్యలో తల్లి ఇరుక్కుపోయింది.
ఈ నేపథ్యంలో కొడుకు కన్నా.. కూతురుకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా విజయమ్మ కొడుకు దగ్గరికి వెళ్లడం లేదు. షర్మిల తన కుమారుడి వివాహ పత్రిక ఇచ్చేందుకు అన్న వద్దకు వెళ్లింది. అప్పుడు కూడా షర్మిల వెంట తల్లి లేదు. ఏపీకి షర్మిల రాకుండా చూడాలని జగన్ తల్లిపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఒత్తిడికి లొంగలేదని టాక్. ఈ నేపథ్యంలో విజయమ్మ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.