New Ration Cards : కొత్త రేషన్ కార్డులు ఇంకెప్పుడు..? ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!
New Ration Cards : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో పేదలకు సంబంధించి ఎన్నో హామీలను పక్కన పెట్టారు. పేదలకు ఆహార భద్రత కల్పించడానికి, పేదలుగా గుర్తించడానికి సంబంధించిన రేషన్ కార్డులను ఇవ్వడానికి గత ప్రభుత్వం మొండికేసింది. అర్హత ఉన్న రేషన్ కార్డు లేకపోవడంతో బియ్యం రాకపోవడమే కాదు వివిధ ప్రభుత్వ పథకాలను అర్హత లేక తల్లడిల్లిపోయారు. ఎన్నో సార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ రెండో టర్మ్ లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు.
అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రేషన్ కార్డులపై పోరాటం కూడా చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇది కొలిక్కి రాకపోవడంతో పేదలు తీవ్ర అసహనంతో నిరీక్షిస్తున్నారు. ప్రజాపాలన రేషన్ కార్డులకు దరఖాస్తు తీసుకుంటామని ప్రభుత్వం సూచించింది. ఆమేరకు పేదలు, అర్హులైన వారు తెల్ల కాగితంపై రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రజాపాలన కార్యక్రమం దాటి నెలన్నర అవుతోంది. ఇప్పటికీ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడకపోవడం పేదలను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే ఇతర నాలుగు గ్యారెంటీలకు ప్రతిపాదిక రేషన్ కార్డే కావడంతో.. వీరి మరింత ఆందోళన చెందుతున్నారు. ఉచిత విద్యుత్, 500లకే గ్యాస్, మహాలక్ష్మి..ఇలా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కచ్చితంగా రేషన్ కార్డే ప్రామాణికం. ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ఎటు తేల్చకపోవడంతో తాము ఆ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతామని ఆవేదన చెందుతున్నారు.
మరో కొన్ని రోజుల్లోనే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దానికి ముందే రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రజాపాలనలో భాగంగా 20లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 90.14 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.