Raithu Runamafi : రైతు రుణమాఫీ ఎప్పుడు? ప్రభుత్వ వ్యూహం ఇదే!

Raithu Runamafi

Raithu Runamafi

Raithu Runamafi : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీలతో పాటు రైతుల కోసం ఈ హామీని ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. దీనిపై ప్రభుత్వం ఏం చెబుతుందోనని రైతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రుణమాఫీ గురించి పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పడంతో పాటు ప్రభుత్వ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం.

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై కసరత్తు ప్రారంభించింది. రుణమాఫీ కోసం ఇప్పటికే బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ట్విటర్ లో ప్రకటించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కార్పొరేషన్ కు మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకే సారి రుణాలు మాఫీ చేయాలని బ్యాంకులను కోరింది. ప్రభుత్వం నెలవారీగా ఐదేళ్ల పాటు ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకుల ముందు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో అప్పు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఈమేరకు మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు రుణగ్రస్తులుగా ఉన్నారు. రూ.2 లక్షల చొప్పున మాఫీ చేస్తే దాదాపు రూ.32 వేల కోట్లు అవసరం కానున్నాయి.

2014, 2018 ఎన్నికల్లో రుణమాఫీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే 2014-18 టర్మ్ లో రుణమాఫీని విజయవంతంగా చేయగలిగింది. మొత్తం 36 లక్షల మంది రైతులకు రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. కానీ 2018-23లో రుణమాఫీని ఏకకాలంలో చేయలేకపోయింది. విడతల వారీగా చేసుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఎన్నికల నాటికి మరికొంత మంది మిగిలే ఉన్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ఎంత వేగంగా అమలు చేస్తోందో చూడాలి. లేకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TAGS