enumerators : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క ప్రశ్న కాదు.. 56 ప్రధాన ప్రశ్నలతో కలిపి 75 ప్రశ్నలను ఎన్యుమరేటర్లు అడుగుతారు. కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, ఇతర వివరాలన్నీ సేకరిస్తుండడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలకు వీటిని ప్రామాణికంగా తీసుకుని ఏం కట్ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇంటింటికీ స్టిక్కర్ల పంపిణీ చివరి దశలో ఉన్న నేపథ్యంలో నేటి నుంచి సర్వే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది ఇలా ఉంటే… సమగ్ర కుటుంబ సర్వే కోసం వెళ్లిన ఎన్యుమరేటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో కొందరు ఇళ్ల యజమానులు సర్వే కోసం వెళ్లిన ఎన్యుమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పి బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అరోరా కాలనీలో నివసించే మరో మహిళ వారిపై దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మరికొందరు తలుపులు తీయడం లేదని, వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని వచ్చిన వారు నిజంగానే ఎన్యుమరేటర్లేనా లేదా మోసగాళ్ల అన్న అయోమయంలో జనాలు ఉండి ఇలా చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటి వివరాల సేకరణ, స్టిక్కర్ల ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తయింది. 9వ తేదీ నుంచి వాస్తవ సర్వే ప్రారంభమవుతుందని సీఎస్ శాంతికుమారి తెలిపారు. సర్వే నిర్వహణపై ఆమె గురువారం ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆమె అన్నారు.