KCR Letter : విద్యత్ అంశంలో ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: కమిషన్ కు కేసీఆర్ లేఖ
KCR Letter : యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలో ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో వివరణ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణ కమిషన్ ఇప్పటికే నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. గడువు నేటితో ముగుస్తుండడంతో జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో అన్నిరకాల చట్టాలను, నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకుపోయామని, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికి అవసరమైన కేూంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు పురోగమించామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ ఆక్షేపించారు. గత ప్రభుత్వ విజయాలను తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కమిషన్ ఏర్పాటు కూడా చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారని అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్ పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ ఆలోచనలు, నిర్ణయాలకు గల కారణాలు సహా అనేక అంశాలను కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని ముందుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసిందని మండిపడ్డారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందన్నారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమని ఆరోపించారు.