KTR As CM Harish Rao Reaction : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లో అధినేత, సీఎం కేసీఆర్ తర్వాత కీలకంగా ఎదిగారు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు. ప్రజాకర్షణలో ఎవరికి వారే సాటి. వీరికి ధీటుగా ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నా, వీరిద్దరి మధ్య అసలు పోటీ అని అంతా అనుకుంటుంటారు. అయితే కేసీఆర్ తర్వాత సీఎం గా అయ్యేందుకు కేటీఆర్ కే చాన్స్ ఉందని ఆయన అభిమానులు, హరీశ్ రావుకే చాన్స్ ఉందని ఈయన అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటారు.
అయితే తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావుకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే మీ పాత్ర ఎలా ఉండబోతున్నదనేది ప్రశ్న. దీనికి మంత్రి హరీశ్ రావు పూర్తి క్లారిటీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్, నేను కేవలం బంధువులం మాత్రమే కాదు. మంచి స్నేహితులం కూడా. మా లో మాకు తగువులు పెట్టేలా ఇలా ప్రశ్నలు వేస్తారు. అయితే మేం ఎప్పుడూ రాష్ర్ట ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంటాం. అదే విధంగా నడుచుకుంటాం. మా అధినేత కేసీఆర్, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఈ హరీశ్ రావు పాటిస్తాడంటూ చెప్పుకొచ్చారు.
అయితే గతంలో వీరిద్దరి మధ్య సీఎం అయ్యే విషయంలో పోటీ ఉందంటూ నెలకొన్న ప్రచారాలను కొట్టిపడేశారు. తమ అధినేత నిర్ణయమే తమకు ఫైనల్ అంటూ ఇప్పటికే పలుమార్లు ఇరువురు తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇద్దరు బలమైన నేతలు ఇలా స్నేహపూర్వకంగా మెలగడం బీఆర్ఎస్ శ్రేణులకు నిజంగా కనులవిందే. వీరిద్దరి నేతృత్వంలో రాష్ర్టంలో బీఆర్ఎస్ కు అడ్డే ఉండదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.