JAISW News Telugu

TDP-Janasena Manifesto : టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఏం ఉండనుంది?

TDP-Janasena Manifesto

TDP-Janasena Manifesto

TDP-Janasena Manifesto : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీలు, నేతలు స్పీడ్ పెంచారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ-జనసేన బహిరంగ సభలు పెడుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన కూడా తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నాయి. ఎన్నికల్లో పార్టీలో కీలకమైన ఎన్నికల మ్యానిఫెస్టోలకు తుది రూపు తెస్తున్నాయి.

మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణాల్లో మ్యానిఫెస్టో ఒకటి. అందులో ఆరు గ్యారెంటీల పేరుతో వివిధ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇవ్వడమే కాదు రైతులకు, నిరుద్యోగులు, సబ్బండ వర్ణాలకు వివిధ హామీలు ఇచ్చింది. ఆ మ్యానిఫెస్టోను ప్రజలు మెచ్చి ఆ పార్టీని గెలిపించారు. 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ మ్యానిఫెస్టోతో సానుకూల ఫలితాలు పొందారు. ఎన్నికల్లో కీలకమైన  మ్యానిఫెస్టోను తయారీలో ప్రస్తుతం ఏపీ పార్టీలు బిజీగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటనకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు..ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు.

చిలకూరిపేట సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. డబ్బులు కట్టకున్నా ఒక పార్టీ సభలకు విపరీతంగా బస్సులు ఇస్తున్నారని ఆరోపించారు. తమకు బస్సులు కేటాయించకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలన్నారు. పోలీసుల వేధింపుల నుంచి పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 7306299999ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కాగా, గతంలోనే టీడీపీ సూపర్ సిక్స్ అంశాలతో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించింది. దీన్ని ప్రజల్లోకి సైతం తీసుకెళ్లారు. జనసేన కూడా తోడు కావడంతో మరో ఆరు అంశాలను ఈ ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. సూపర్ సిక్స్ లో మహిళలు, రైతులు, యువత, బీసీలకు సంబంధించిన కీలక హామీలు ఉన్నాయి. వీటితో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం అంశాలను దీనికి జతచేసినట్లు సమాచారం. భవన నిర్మాణ కార్మికులు, యువతకు ఉపాధి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఇన్సెంటివ్ లు, పల్లెల అభివృద్ధి.. తదితర  అంశాలు ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఉండబోతున్నట్లు సమాచారం.

Exit mobile version