Age of Thirty : ఆధునిక కాలంలో మన జీవన శైలి మారుతోంది. ఇరవైలోనే అరవైలా మారుతున్నారు. ఇరవైలోనే పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి రోగాలకు గురవుతున్నారు. ఫలితంగా జీవితాంతం మందులు వాడుతూ కాలం గడుపుతున్నారు. ఈనేపథ్యంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మన అలవాట్లు మార్చుకునేందుకు చొరవ తీసుకోవాల్సిన గత్యంతరం వస్తోంది.
గతంలో ఏ రకమైన రోగమైనా ముసలితనంలో వచ్చేవి. షుగర్, బీపీలు కూడా యవ్వనంలో వచ్చేవి కావు. ఏ డెబ్బయి ఏళ్లకో గానీ వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే షుగర్, బీపీలు పలకరిస్తున్నాయి. దీంతో శరీరం పలు ఇబ్బందులకు గురవుతోంది. నిత్యం మందులు మింగుతూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు తలెత్తుతుండటం గమనార్హం. మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా మన అలవాట్లు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
ముప్పై దాటిందంటే చాలు మనం నిరంతరం చెక్ చేసుకోవాల్సిందే. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియడం లేదు. రోగం వచ్చాక జాగ్రత్తలు తీసుకునే కంటే రాకముందే జాగ్రత్తగా ఉంటే సమస్యలు ఉండవు కదా అని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ముందస్తు ముప్పును గుర్తించడం మన బాధ్యతగా చూసుకోవాలి.
ముప్పై దాటిందంటే క్రమంగా మన ఆరోగ్యం క్షీణించడం సహజం. దీంతో మనం తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే మనకు లేనిపోని రోగాలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. మన ఆరోగ్యం గతి తప్పకుండా ఉండాలంటే శరీరానికి పలు టెస్టులు చేయించడం తప్పనిసరి. ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే.