Congress : దేశంలో ఎటు చూసినా సార్వత్రిక ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. మొత్తం ఏడు విడతల ఎన్నికల్లో నేటితో ఐదు విడత ముగుస్తోంది. మరో రెండు విడతలు జూన్ 1 నాటికి పూర్తవుతాయి. అనంతరం 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో మాటల తూటాలు పేలాయనే చెప్పవచ్చు. మూడు పార్టీలకు కీలకం కావడంతో సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఈ ఎన్నికల ఘట్టం ముగిసింది.
డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తామనుకున్న బీఆర్ఎస్ అధినేతకు తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు అప్పగించి అధికారం కట్టబెట్టారు. ఇక అప్పటినుంచి బీఆర్ఎస్, బీజేపీ రేవంత్ సర్కార్ ను ఎప్పుడు పడగొడుదామా అన్నట్టుగా చూస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత ఏమైనా జరుగొచ్చని ఆ పార్టీల నేతలు తరుచూ వ్యాఖ్యానించడం తెలిసిందే.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు రాకుంటే రేవంత్ రెడ్డి పోస్ట్ ను ఊస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శించారు. అలాగే లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కూడా చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అమలు కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. పథకాలు అమలు చేయని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు నిత్యం అంటూనే ఉన్నారు.
అయితే పథకాలను అమలు చేయకుంటే ప్రభుత్వం పడిపోవాల్సిన అవసరం ఏంటని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడుతామని బెదిరించడం ఎందుకన్నారు. పథకాలు అమలు చేయకుంటే ప్రభుత్వాన్ని గద్దె దిగాలని డిమాండ్ చేయడం ఎందుకంటున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి పాలించారు కదా.. మరి వారు అన్ని హామీలను అమలు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు.