Women Success : మహిళల విజయానికి ఇలాగేనా విలువ కట్టేది..? సానియా మీర్జా ఎమోషనల్
Women Success : సానియా మీర్జా ఆరేళ్ల వయస్సులోనే టెన్నిస్ రాకెట్ పట్టి దేశంలో ఆ ఆటకు బ్రాండ్ అంబాసీడర్ గా మారింది. ఆమెను చూసే ఎంతో మంది యువత, ముఖ్యంగా యువతులు టెన్నిస్ బాట పట్టారు. తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించారు. 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు. భారత్ లో ఏ మహిళా టెన్నిస్ లో ఇన్ని విజయాలు సాధించలేదు. ఇటీవలే తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సానియా మీర్జా తన ట్వీట్ల ద్వారా సామాజిక సమస్యలపై స్పందిస్తున్నారు.
తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్నదానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని రాసుకొచ్చారు సానియా మీర్జా. స్త్రీ, పురుష వివక్ష ఇంకా వ్యాప్తిలో ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన యాడ్ పై స్పందిస్తూ సానియా సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
స్థానికంగా పలు సేవలు అందించే అర్బన్ కంపెనీ ఇటీవల (చోటీ సోచ్- సంకుచిత ఆలోచనలు) పేరుతో ఓ వీడియో యాడ్ రిలీజ్ చేసింది. ‘‘ప్రతీ ఒక్కరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుంది..దాన్ని ఇతరులు కూడా గౌరవించాలి’’ అనే స్ఫూర్తిదాయక సందేశంతో ఆ ప్రకటనను రూపొందించింది. అందులో ఓ మహిళ బ్యూటీషియన్ గా పనిచేస్తూ కారు కొంటుంది. అది చూసి ఇరుగుపొరుగూ వారు ఆమె వృత్తిని చులకన చేస్తారు. దాన్ని ఆమె తమ్ముడూ అవమానంగా భావిస్తాడు. అప్పుడు ఆమె సోదరుడితో మాట్లాడుతూ..‘‘ప్రతీ ఒక్కరూ నేను కొన్న కారునే చూస్తున్నారు. కానీ, దాని వెనుక నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు. మహిళ విజయం సాధించిన ప్రతీసారీ.. ఈ సమాజం కించపర్చాలనే చూస్తుంది. అలాంటి వారి మాటలను పట్టించుకుని మన జీవితాన్ని వదులుకోవాలా? కష్టపడి ముందుకు సాగాలా? అనేది మన నిర్ణయమే’’ అని అంటుంది.
ఈ వీడియోకు సానియా స్పందిస్తూ ఉద్విగ్నభరిత పోస్ట్ చేశారు. ‘‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచాను. అది గొప్పదే కదా? డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆరు గ్రాండ్ స్లామ్ లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. నా కెరీర్ లో ఎంతో మంది మద్దతు ఇచ్చారు. కానీ ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదు..’’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు.