Elections 2024 : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మండుతున్న ఎండలకు తోడు పొలిటికల్ లీడర్ల మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణ లో 17 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు పై వ్యతిరేకత ఉందని కొన్ని సర్వేలు చెబుతుండగా.. మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్ని సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ సీట్లు రావొచ్చని, బీజేపీ 6 నుంచి 7 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ ఒక సీటుకే పరిమితమవుతుందని చెబుతున్నాయి. ఒక్క సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతేనే బీఆర్ ఎస్ నుంచి లీడర్లు, ప్రజాప్రతినిధులు అందరూ వెళ్లిపోతున్నారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో గనక బీఆర్ ఎస్ తన ప్రభావం చూపించకపోతే ఇక ఆ పార్టీ సంగతి మరిచిపోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి తరలిపోతున్నారు. కారు దిగి పార్టీ అధినాయకత్వాన్నే ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుందోనని కార్యకర్తలు సందేహిస్తున్నారు.
ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్రంలో గనక అధికారంలోకి వస్తే తెలంగాణలోో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ లో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొంతమందికి రేవంత్ రెడ్డి బిహేవియర్ నచ్చడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ కలిసి దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతోనే ఒక్కసారిగా రూటు మార్చిన రేవంత్ రెడ్డి బయట పార్టీల వారిని కలుపుకొని బలంగా ఉన్నట్లు నిరూపించుకుంటున్నారు. ఏమైనా సంఘటనలు ఎదురైనా ప్రభుత్వానికి ఢోకా ఉండదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పార్లమెంటు ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల పరిస్థితి ఏం కానుందో చూడాలి.