PM Modi : మోడీ ప్రసంగాల వెనుక మర్మం ఏంటి?
PM Modi : పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా 400 సీట్లు గెలవాలన్నదే కమలనాథుల టార్గెట్ . ఈసారి ఊహించని రీతిలోనే సీట్లు వస్తాయని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. అందుకే.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే పలు భారీ బహిరంగ సభల్లో పాల్గొనడం, ర్యాలీలు నిర్వహించడం.. అభ్యర్థులను గెలిపించాలని సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో పోలింగ్ ఉండటంతో మరింత జోరు పెంచారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టబోయి తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది.
తెల్లారితే లేస్తే అంబానీ, అదానీ అని మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి వారి గురించి ఎందుకు మాట్లాడటం మానేశారని మోడీ ప్రశ్నించారు. అదాని, అంబానీ నుంచి ఎంత మొత్తంలో నిధులు ఇచ్చారని కాంగ్రెస్ ను మోడీ నిలదీశారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు.
మోడీ ఆప్తమిత్రులైన కుబేరులు అదాని, అంబానీల గురించి తలుపులు మూసేసి మాత్రమే మాట్లాడుతారని మొదటిసారి బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నారని ప్రియాంక గాంధీ గట్టి కౌంటరే ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీకి ఎంత గడ్డు కాలం వచ్చిందన్నారు. ఆఖరికి తనకు అండగా నిలిచిన స్నేహితుల మీద కూడా మాటల దాడి చేసే పరిస్థితికి చేరుకున్నారని ట్వీట్ చేశారు. నిజంగానే.. అదానీ, అంబానీలు కాంగ్రెస్ కు ఎన్నికల ఫండింగ్ చేశారా..? వారి వద్ద అంత పెద్దమొత్తంలో బ్లాక్ మనీ ఉంటే ఈడీ, సీబీఐల ఉనికి ఎందుకు లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ ప్రత్యర్ధుల విషయంలో దూకుడుగా వ్యవహరించే ఈడీ, సీబీఐలు మోడీ బహిరంగంగా అదానీ, అంబానీల వద్ద నల్లదనం ఉందని చెప్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.