liquor shops : ఏపీలో మద్యం షాపుల టెండర్లు తక్కువగా రావడానికి కారణమిదే ?

 liquor shops

liquor shops

liquor shops :  ఏడాది పొడవునా మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో ఈ వ్యాపారం చేసి సంపాదన రుచి చూసిన వాళ్లు  మళ్లీ చేయడానికి ఎంత వరకైనా వెళ్తారు. తాజాగా ఏపీలోనూ అదే జరుగుతోంది. గతంలో మద్యం వ్యాపారం చేసిన బడా బాబులు ఇప్పుడు పెద్దఎత్తున వైన్ షాపులను దక్కించుకునేందుకు అన్ని దారులు తొక్కుతున్నారు. అందితే కాలర్ అందకుంటే కాళ్లు అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు.  అటు  ఎక్సైజ్ అధికారులు కూడా వీరికి సపోర్టు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  టెండర్ల ప్రక్రియ, దుకాణాల కేటాయింపులు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టింది. అయితే ఈ సమయంలో ఎక్కువగా ఆన్‌లైన్ దరఖాస్తులు రావాలి. కానీ.. విచిత్రంగా ఏపీలో ఆఫ్ లైన్ అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు ఎక్సైజ్ అధికారులు, టీడీపీ నేతలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన షాపులను దక్కించుకునేందుకు ఆన్ లైన్ విధానంలో అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటి వరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఆఫ్‌లైన్‌లో 6 వేల 520 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంమీద ఒక్కో దుకాణానికి కనీసం 3 దరఖాస్తులు కూడా రాలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో దుకాణానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి. ఇప్పుడు ఇంత తక్కువ వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు.  గతంలో మద్యం దుకాణాలు నడిపిన వారికి భారీగా లాభాలు వచ్చాయి. దీంతో కొందరు సిండికేట్‌గా ఏర్పడి మిగతా వాళ్లకు షాపులు రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులతో కుమ్మక్కై, సాంకేతిక కారణాలతో దరఖాస్తు ప్రాసెస్ కాకుండా అడ్డుకుంటున్నారు.  ఇక ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఎక్సైజ్ కార్యాలయాలకు వచ్చిన వారిని వీలైతే కొనుగోలు చేస్తున్నారు. లేకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

వైన్ షాపుల టెండర్లు ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులకే దక్కేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏలూరు జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి మరీ చెప్పారని ప్రచారం జరుగుతోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లోని వైన్ షాపులు మా దగ్గరకు రావాలి. ఆ షాపుల టెండర్ దారులకు చాలా ఇస్తాం. వీలైతే మీరు మాట్లాడండి.. లేని పక్షంలో ఎవరు టెండర్లు వేశారో వివరాలు ఇవ్వండి.. మేం చూసుకుంటాం’’ అని ఎక్సైజ్ అధికారులతో ఎమ్మెల్యే అన్నారు. ఒక్కో దుకాణం ఒక్కో టెండర్‌కు రుసుం 2 లక్షలు. ఇది టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి వసూలు చేసే రుసుము. ఇది తిరిగి చెల్లించబడదు. ఎక్కువ దరఖాస్తులు వస్తే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది. కానీ సిండికేట్, రాజకీయ దౌర్జన్యం కారణంగా దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయన్న వాదన ఉంది. దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారిని ఆపి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

TAGS