JAISW News Telugu

CM Jagan vs Anganwadis : జగన్ ఎస్మా మంత్రాంగం : అంగన్ వాడీలపై ఆగ్రహమా? కమ్యూనిస్టులపై కోపమా?

CM Jagan vs Anganwadis : “జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించడానికి ఎవరూ సాహసించని స్తబ్ధతను అంగన్ వాడీలు బద్దలుకొట్టారు. రాష్ట్రంలో రైతులు మినహా అన్ని వర్గాల వారు రోడ్డెక్కారు. ఆఖరికి పూజారులు, వాలంటీర్లు కూడా !”
“ రాజకీయాల్లో హత్యలుండవు.. అన్ని ఆత్మహత్యలే ” అన్న వాక్యాలకు ప్రత్యక్ష ఉదాహరణగా నేటి వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోంది. ప్రత్యర్ధుల ఎత్తులు, చిత్తులు, వ్యూహాప్రతివ్యూహాలకు సమాధానం లేని పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యర్ధుల ముందల సాగిలపడటం సహజంగా రాజకీయాల్లో ఎక్కువగా చూస్తుంటాం.. కానీ ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని నేటి వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా దారికి పోయే దాన్ని తెచ్చి తలకు చుట్టుకుంటూ లేని పోని సమస్యలకు తానే తావిస్తోంది.
ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగెడుతున్న కీలక తరుణంలో, ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన అధికార పార్టీ తనకు తానే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంటే.. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్న విధంగా ప్రతిపక్షాలకు పెద్దగా పనిలేకుండా తడిగుడ్డ వేసుకుని పడుకునే పరిస్థితులు కల్పిస్తోంది.. ఎన్నికల సమీపిస్తున్న వేళ, అన్ని వర్గాలు తమతమ కోర్కెలు, డిమాండ్ల సాధనకు రోడ్డెక్కడం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇందులో పెద్దగా ఆక్షేపణీయం ఏమీ లేదు. మనిషి ఆశాజీవి.. ప్రతి ఒక్కరు తమకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఆయా ప్రభుత్వాలకు విజ్ఞపనలు అందచేయడం, వేడుకోవడం… కుదరని పక్షంలో ధిక్కార స్వరం వినిపించడం సర్వసాధారణం… ఇదే తరహాలో ఈ ప్రభుత్వంలో తమ కోర్కెల సాధనకు ఇప్పటికే అనేక సంఘాలు రోడ్డెక్కాయి.. అంగన్ వాడీలు కార్యకర్తలు, వర్కర్లు సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం నేరవేర్చని క్రమంలో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వీరు చేస్తున్న ఉద్యమానికి ప్రజా సంఘాలతో పాటు సామాన్య ప్రజానీకం నుంచి కూడా విశేష స్పందన వస్తున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వీరిని భయానో, నయానో తమ దారికి తెచ్చుకునేందుకు సామదానబేదదండోపాయాలను ప్రయోగించినా, అంగన్ వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి ఆఖరి అస్త్రంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.
అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో జరిగిన చర్చలు విఫలం కావడంతో, వారిని బెదిరించేందుకు ప్రభుత్వం సమ్మె కాలానికి వారి జీతంలో కోత విధించింది. అయినా వారు వెన్నుచూపక, సమ్మె తీవ్రతను ఉధృతం చేయడంతో, వైసీపీ ప్రభుత్వానికి ఏమీ పాలుపోక, చివరకు అంగన్ వాడీలపై కొరడా ఘలిపించేందుకు అతి కఠినమైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఎస్మాను ప్రయోగించడంపై  ప్రతిపక్షాలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలతో పాటు సామాన్యులు సైతం జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి నివ్వెరపోతున్న పరిస్థితి..
అంగన్ వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 2 ను జారీ చేసింది. ESMA అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్)..  సమ్మెలు, నిరసన కార్యక్రమాలతో ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 1981 లో ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు విధులకు హజరు కాకుండా సమ్మెలోకి దిగితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. ఎస్మా నిబంధనలు అధిగమించి ఎవరైనా సమ్మెకు పాల్పడితే, వారిపై వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడంతో పాటు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు… వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అవకాశం కూడా ఎస్మా కల్పిస్తోంది. ఒకసారి ఎస్మాను ప్రయోగిస్తే అది 6 నెలల పాటు కొనసాగుతోంది.
సాధారణంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్న క్రమంలో ఎస్మా చట్టాన్ని ప్రభుత్వాలు ప్రయోగిస్తాయి.. కరోనా వంటి తీవ్ర పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఇటువంటి చట్టాలను ప్రభుత్వాలు ప్రయోగించడం పరిపాటి.. ఎస్మాను నేడు వైసీపీ ప్రభుత్వం ప్రయోగించడం కొత్తేమీ కాదు.. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్మాను ప్రయోగించిన పరిస్థితులు ఉన్నాయి.. అయితే ఇలా ఎన్నికల ముందు ఉద్యోగులతో కయ్యానికి కాలు దువ్వే విధంగా రెచ్చగొట్టే శైలిలో ఏ ప్రభుత్వమూ గతంలో వ్యవహారించలేదు. గతంలో ఎస్మాని ప్రయోగించిన ప్రభుత్వాలు ఉన్నాయి..కానీ ఇలా ఎన్నికల ముందు ఈ తరహా రెచ్చగొట్టే శైలిలో ఏ ప్రభుత్వం వ్యవహారించలేదు.
అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగంతో ఇంతకాలం పాటు నిద్రాణ వ్యవస్థలో ఉన్న ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు సంఘాలను పురికొల్పే విధంగా ప్రభుత్వ వ్యవహారశైలి కనిపిస్తోంది.. అంగన్ వాడీలకు మద్దతిస్తున్న కమ్యూనిస్టులపై కోపమా, అంగన్ వాడీలపై ఆగ్రహమో తెలియదు గానీ మొత్తంగా ఉద్యోగుల హక్కులు కాలరాస్తున్నారంటూ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు సహా పలువురు రోడ్డెక్కిన నేపథ్యంలో అంగన్ వాడీల సమస్యను ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకోలేకపోతే ఇది అగ్నిజ్వాలలా దహించే ప్రమాదం లేకపోలేదు.
మరోవైపు ఐప్యాక్ నివేదికల పేరుతో రోజుకో అధికార ఎమ్మెల్యే సీటుకు చిల్లుపడటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హట్ టాఫిక్ మారుతోంది. ఎన్నికల్లో అభ్యర్ధుల మార్పు మంచిదే గానీ, పక్కన తెలంగాణలో అభ్యర్ధులను మార్పు చేయకపోవడంతోనే అధికార టీఆర్ ఎస్ ఓడిపోయిందనే భ్రమలో ఇక్కడ పరిధికి మించి అభ్యర్ధులను మార్చాలనుకోవడం ద్వారా ప్రభుత్వం తన లోగుట్టు తానే బయటపెట్టుకుంటున్నట్లు అవుతోంది. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత లేదు.. కేవలం స్థానికంగా ఎమ్మెల్యేలపై మాత్రమే వ్యతిరేకత ఉందన్నట్లు ఐప్యాక్ చేస్తున్న హడావుడి కూడా వాస్తవ దూరంగా ఉంది. అదే సమయంలో కొద్దిమందిని జబ్లింగ్ చేసినంత మాత్రన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అంతా పోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. దాదాపుగా 60 నుంచి 80 మంది వరకు అభ్యర్ధులను మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే వీరంతా రెబల్స్ గా మారి, ఆయా పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా స్థానికంగా వెన్నుపోటు పొడిచేందుకు ప్రతిపక్షాలతో కలిసి అధికార వైసీపీ ఓటమికి వీరు ఎంతదూరమైనా వెళ్తారనడంలో ఎంత మాత్రం సందేహం అక్కర్లేదు..
సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయంలోనే రాజ్యసభ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రానుంది. ఈ దఫా రాష్ట్రం నుంచి 3 సీట్లు ఖాళీ కానున్నాయి.. 2024 ఏప్రిల్ 2 వ తేదీన వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సీఎం రమేష్ స్థానాలు ఖాళీ కానున్నాయి.. సాధారణంగా ఇప్పుడున్న బలం ప్రకారం వైసీపీ 3 రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవచ్చు. టీడీపీ కనీసం పోటీలో నిలబడే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
కానీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను మారుస్తున్న క్రమంలో వారంతా రాజ్యసభ ఎన్నికల నాటికి టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే ప్రమాదం లేకపోలేదు. ఇదే జరిగితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, ఎన్నికలకు ముందే, వచ్చే ఫలితాలతో సంబంధం లేకుండా టీడీపీకి అప్పనంగా ఒక రాజ్యసభ సీటుని కోల్పోయే ప్రమాదం లేకపోలేదు..
ఎన్నికల వేళ ఇటు ఉద్యోగులు, అటు ప్రజాప్రతినిథుల విషయంలో ప్రభుత్వం చూపుతున్న అత్యుత్సాహాం, నిరంకుశ వైఖరి వైసీపీ ప్రభుత్వం పుట్టు ముంచే ప్రమాదం లేకపోలేదు. ఒకవైపు టీడీపీ, జనసేన ఏకం కావడం, మరో వైపు షర్మిల ఏపీపైకి దండెత్తి వస్తున్న క్లిష్ట సమయంలో ఎస్మాను ప్రయోగించడం, పరిమితికి మించి ఎమ్మెల్యేల మార్పు వంటి అంశాలను చూస్తే, సరైన వ్యూహాం లేకుండా వైసీపీ వేస్తున్న తప్పటడుగులుగానే భావింపక తప్పని పరిస్థితి…
– తోటకూర రఘు
సీనియర్ జర్నలిస్టు.
Exit mobile version