Telangana BJP : లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి గల కారణాలను పోస్టుమార్టం చేసిన బీజేపీ నేతలు పలువురు అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన మారి అధిష్ఠానం దాక వెళ్లింది. ఈ విషయంపై పార్టీ పెద్దలు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఖర్చులపై హైకమాండ్ దృష్టి సారించింది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ పక్కదారి పట్టిందని పార్టీలోని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ అభ్యర్థులు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికలలో ఖర్చుల కోసం పార్టీ పంపించిన పార్టీ ఫండ్ కింది స్థాయి వరకు చేరకపోవడంతో గెలవాల్సిన పలుచోట్ల ఓటమి పాలైనట్టు అభ్యర్థులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో జరిగిన ఎన్నికలలో ఏం జరిగింది? బీజేపీ ఓటమికి కారణాలు ఏమిటి? ఎన్నికల కోసం పంపించిన పార్టీ ఫండ్ ఏమైంది? వంటి అనేక అంశాలపై తేల్చేందుకు అమిత్ షాకు చెందిన షాడో టీమ్ రంగంలోకి దిగి సమాచారం సేకరిస్తోందని సమాచారం.
2023లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని భావించింది. ఈక్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తన అభ్యర్థులను మూడు కేటగిరిలుగా విభజించి ఫండ్ అందజేసినట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ఏ కేటగిరి అంటే గెలిచేదిగా, బీ కేటగిరి అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా, సీ కేటగిరి అంటే గెలిచే చాన్స్ లేకపోయినా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా నిధులు సమకూర్చినట్టు సమాచారం.
అయితే ఈ విధంగా కేటాయించిన నిధులు చాలా చోట్ల క్షేత్ర స్థాయి దాక చేరలేదని సదరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము ఓడిపోయామని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో పార్టీ ఫండ్ వ్యవహారం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.