Etela Rajender : దేశంలోనే మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓటర్ల సంఖ్యా పరంగా దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం ఇదే. ఇక్కడ అత్యధికంగా 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది పూర్తిగా అర్బన్ పార్లమెంట్ నియోజకవర్గం. మల్కాజిగిరి స్థానం నుంచి ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. దీంతో మల్కాజిగిరి ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి బరిలో దిగారు.
త్రిముఖ పోరు
మల్కాజిగిరిలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. మే 13న జరిగిన పోలింగ్ లో ఇక్కడ 50.78 శాతం ఓటింగ్ నమోదైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 53.90 పోలింగ్ శాతం నమోదు కాగా.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి స్వల్పంగా తగ్గింది.
రేవంత్ రెడ్డికి గెలుపు కీలకం
మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం స్థానం నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2023లో సీఎం పదవి చేపట్టిన అనంరతం రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి స్థానం మార్చి మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈటలకు మద్దతుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు జోరుగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి గెలిస్తేనే రాజకీయంగా ఈటలకు మరింత భవిష్యత్ ఉంటుంది. లేక పొలిటికల్ గా మనుగడ ప్రశ్నార్థమే అను చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.